యూపీలో ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం…

సుదీర్ఘంగా సాగుతున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఏడు విడుతల ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌ సహా మొత్తం 10 జిల్లాల్లోని 57 స్థానాల్లో ఓటింగ్‌ జరుగుతున్నది. మొత్తం 676 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పది జిల్లాల్లోని 2,14,62,816 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,14,63,113 మంది పురుషులు, 99,98,383 మంది మహిళలు, 1,320 మంది థార్డ్‌ జెండర్‌ వారు ఉన్నారు.
సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తుండగా, ఇటీవలే బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్‌ మౌర్య ఫాజిల్‌నగర్‌లో బరిలో నిలిచారు. ఇక పీసీసీ అధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ లల్లూ తమ్‌కుహీరాజ్‌ నుంచి పోటీచేస్తున్నారు. కాగా, తులసీపూర్‌, గోరఖ్‌పూర్‌ రూరల్ నియోజకవర్గాల్లో అత్యధికమంది అభ్యర్థులు పోటీచేస్తుండగా, సలేంపూర్‌లో అతితక్కువ మంది పోటీపడుతున్నారు.2017లో జరిగిన ఎన్నికల్లో 46 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. ఇక మార్చి 7న ఏడో దశ పోలింగ్‌ జరుగనుంది. మార్చి 10 యూపీ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడనున్నాయి.