ఉత్తారాఖండ్‌లో క‌ల‌క‌లం….మంచు కొండ‌లు క‌రిగి ధౌలిగంగ‌ న‌దిలో ఒక్క‌సారిగా వ‌ర‌దలు…..

మంచు కొండ‌లు క‌రిగి ధౌలిగంగ‌ న‌దిలో ఒక్క‌సారిగా వ‌ర‌దలు పోటెత్త‌డం ఉత్తారాఖండ్‌లో క‌ల‌క‌లం రేపింది. చ‌మోలీ జిల్లా త‌పోవ‌న్ ఏరియాలోని రేణి గ్రామం స‌మీపంలోగ‌ల ఓ విద్యుత్ ప్రాజెక్టు స‌మీపంలో ఈ ఆక‌స్మిక‌ విప‌త్తు సంభ‌వించింది. దీంతో చాలాచోట్ల న‌ది ఉప్పొంగి ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ప‌లు ఇండ్లు కొట్టుకుపోయాయి. ఈ వ‌ర‌ద‌ల్లో జ‌నం కూడా చాలామంది కొట్టుకుపోయి ఉంటార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.
ఈ విప‌త్తు నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. చ‌మోలీ జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగాల సిబ్బంది రంగంలో దిగారు. న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎలాంటి పుకార్లు న‌మ్మ‌వ‌ద్ద‌ని, ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి టీఎస్ రావ‌త్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తిచేశారు.
ధ‌్వంస‌మైన రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు
ఉత్తార‌ఖండ్‌లోని చ‌మోలీ జిల్లా త‌పోవ‌న్ ఏరియాలోని నందాదేవి మంచుకొండ‌ నుంచి మంచుగ‌డ్డ‌లు విరిగిప‌డ‌టంతో ధౌలిగంగ న‌దిలో ఒక్కసారిగా వ‌ర‌ద పోటెత్తింది. ఈ వ‌రద తాకిడికి మంచుకొండ దిగువ‌న ఉన్న రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు ధ్వంస‌మైంది. ధౌలిగంగ న‌ది నుంచి వ‌ర‌ద అల‌క‌నంద న‌ది వైపు ప‌రుగుతీస్తుండ‌టంతో అల‌క‌నంద న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. న‌దీ స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌లు ఇండ్లు ఆయా ప్రాంతాల‌ను ఖాళీ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు….దిగువ‌న డ్యామ్‌ల‌ను ఖాళీ చేయిస్తున్న అధికారులు
ఉత్తరాఖండ్‌లో నందాదేవి మంచుకొండ నుంచి హిమ‌పాతం సంభవించి వ‌ర‌దలు పోటెత్త‌డంతో ఆ రాష్ట్రం ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ముందుజాగ్ర‌త్త‌గా వ‌ర‌ద మార్గంలోని డ్యామ్‌ల‌ను ఖాళీ చేయిస్తున్న‌ది. శ్రీన‌గ‌ర్ డ్యామ్, రిషికేశ్ డ్యామ్‌ల‌ను ఇప్ప‌టికే ఖాళీ చేయించింది. ధౌలిగంగ దిగువ‌నగ‌ల అల‌క‌నంద న‌దిలోకి వ‌ర‌ద ప‌రుగులు పెడుతుండ‌టంతో అల‌క‌నంద న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అదేవిధంగా భ‌గీర‌థి నది నుంచి కూడా అల‌క‌నంద న‌దిలోకి నీటి ప్ర‌వాహాన్ని నిలిపేశారు.