ఉత్తరాయణ పుణ్యకాలం….

ఉత్తరాయణ పుణ్యకాలం:

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనదంటే సమస్త భూతములకి కూడా ఆరోగ్యం సిద్ధించటం ఆరంభిస్తుంది. ఎందుచేతనంటే సూర్యుడు భూమికి దగ్గరగా దిగుతాడు ఇక సూర్యుడు భూమికి దగ్గరగుట చేత సూర్యకాంతి చాలా విశేషంగా భూమి మీద ప్రసరిస్తుంది. అంతటి సూర్యకాంతి భూమి మీద ఎప్పుడైతే విస్తరించిందో సమస్త భూతములు ఆరోగ్యాన్ని పొందుతాయి. లోకంలో అన్ని ప్రాణులకి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన మహానుభావుడు భాస్కరుడు. ఆ సూర్యభగవానుడు ఒక్కడే. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అనేటటువంటి నానుడి ఏర్పడింది. పైగా ఇక వసంతఋతువు ప్రారంభమవటం మొదలగుతుంది. వసంతఋతువు ప్రారంభమవుతోంది అంటే అంతకు ముందే చెట్లన్నీ ఆకులు రాల్చేసి తరవాత చిగర్చటం మొదలుపెడతాయి. ప్రకృతి అంతా కూడా అందాలు సంతరించుకోవటానికి కావలసిన నేపథ్యం ఆవిష్కృతమవటానికి కావలసిన నాంది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతుంది. ఇన్ని రకలుగా మనిషికి సమస్తభూతములకి కూడా కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన సూర్యతేజస్సు ప్రసరణమయ్యేటటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతుంది..

సంక్రాంతి సందడి మొదలైనప్పటి నుంచీ ఉత్తరాయణ పుణ్యకాలం అనే మాట వింటుంటాం. ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అంటున్నారంటే దక్షిణాయణం పాపకాలమనా… ఎందుకిలా అంటారు…సరతి చరతీతి సూర్యః” అంటే సంచరించేవాడని అర్థం. సూర్యుడి సంచారం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఏడాది కాలం దేవతలకు ఒక్కరోజుతో సమానం.
“ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత”
అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి.
“సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే “చేరడం” లేదా “మారడం”అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో మారుతూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే..రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవరైతే భక్తిశ్రద్ధలతో స్నానమాచరించడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రుడిగా ఉండిపోతాడని అంటారు.