వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి లైన్‌ క్లీయర్.. వేదిక మార్పు..!!

ఏపీ ప్రభుత్వం నుంచి సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకి సంబంధించిన తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. నిన్న బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషయంలోనూ అదే జరిగింది. చిత్ర యూనిట్‌ నిర్వహించాలనుకున్న వెన్యూకి పర్మిషన్‌ ఇవ్వలేదు, దీంతో మరో చోట నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో నిర్వహించబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. కానీ నిర్మాతలకు షాకిచ్చారు పోలీసులు. పర్మిషన్‌ ఇవ్వలేదు. మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఓకే అన్నారనే సమాచారం వచ్చింది. మళ్లీ ఏపీ ప్రభుత్వం నుంచి అభ్యంతరం చివరికి వెన్యూ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌కి మార్చాల్సి వచ్చిందట. ఫైనల్‌గా ఈ వేదికని ఫిక్స్ చేసినట్టు తెలిపింది యూనిట్‌. అయితే ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కి నిర్మాతలు థ్యాంక్స్ చెప్పడం విశేషం. పర్మిషన్‌ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు యూనిట్‌ ఏపీ సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి రేపు(జనవరి 8న) వైజాగ్‌లోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. దీనికోసం యూనిట్‌ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో చిరంజీవితోపాటు రవితేజ, శృతి హాసన్‌, దర్శకుడు బాబీ, నిర్మాతలు, ఇతర చిత్ర బృందం పాల్గొనబోతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. హిందీలోనూ దీన్ని రిలీజ్‌ చేస్తుండటం విశేషం.