వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య..!

వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య..

వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి (45) దారుణహత్యకు గురయ్యారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఆరుబయట నిద్రిస్తున్న ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో తల నరికి చంపేశారు.

మృతుడు శ్రీధర్‌రెడ్డి కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. హత్యపై హర్షవర్దన్‌ రెడ్డి స్పందించారు. రాజకీయ కక్ష్యతోనే శ్రీధర్‌రెడ్డిని హత్య చేశారని ఆయన ఆరోపించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు.

ఇటీవల బీఆర్‌ఎస్‌ మద్దతుదారులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని హర్షవర్దన్‌రెడ్డి చెప్పారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

ఇది కాంగ్రెస్ ప్రేరేపిత హత్యలే..brs

బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటోంది. బీఆర్ఎస్ ముఖ్యనేత , మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీధర్ రెడ్డి హత్యపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. తెలంగాణలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యింది. గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటి పిచ్చిపనులు కాంగ్రెస్ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు అరాచకాలు, దాడులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ హత్యా రాజకీయాలు ఆపకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించింది.