వారణాసి – కాశీ విశ్వనాథ్ కారిడార్. ప్రధాని మోదీ ప్రారంభించనున్న ఈ కారిడార్ ప్రత్యేకతలేంటి..!!

వారణాసి – కాశీ విశ్వనాథ్ కారిడార్.
R9TELUGUNEWS.COM.
ప్రధాని మోదీ ప్రారంభించనున్న ఈ కారిడార్ ప్రత్యేకతలేంటి..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ను ఈరోజు ( సోమవారం ) జాతికి అంకితం చేయనున్నారు .

వారణాసికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మొదట కాల భైరవ ఆలయంలో హారతి ఇచ్చారు . తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లడానికి ప్రధాని మోదీ , యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథే కలిసి ఖిర్కియా ఘాట్ నుంచి లలితా ఘాట్ వరకూ డబుల్ డెకర్ బోటులో ప్రయాణించారు .

గంగా నదీ తీరాన ఘాట్ల దగ్గర ఉన్న జనాలకు చేతులు ఊపుతూ ముందుకు సాగారు . లలితా ఘాట్ చేరుకున్న తర్వాత ప్రధాని కాశీ విశ్వనాథుడికి పూజలు చేయనున్నారు . తర్వాత ఆయన కాశీ విశ్వనాధ్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు .

యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద వేడుకలా నిర్వహించడానికి నగరాన్ని అందంగా అలంకరించింది .

32 నెలల్లో పూర్తయిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్

1669 లో అహిల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు .

ఆ తర్వాత దాదాపు 350 ఏళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ విస్తరణ , పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8 న విశ్వనాథ్ ఆలయ కారిడార్కు శంకుస్థాపన చేశారు .

అది జరిగిన దాదాపు రెండేళ్ల 8 నెలలకు ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ 95 శాతం పనులు పూర్తయ్యాయి .

మొత్తం కారిడార్ నిర్మాణానికి రూ .340 కోట్లు వ్యయం చేశారని భావిస్తున్నారు . అయితే దీని మొత్తం వ్యయం గురించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు .

మొత్తం కారిడార్ను దాదాపు 50 వేల చదరపు మీటర్ల ఒక పెద్ద ప్రాంగణంగా నిర్మించారు . దీని ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది . 3 విశ్వనాథ్ కారిడార్ను మొత్తం 3 భాగాలుగా విభజించారు .

మొదటిది ఆలయ ప్రధాన భాగం . దీనిని రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించారు . ఇందులో నాలుగు పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి . ఇందులో ఒక ప్రదక్షిణ మార్గం కూడా నిర్మించారు . ఆ ప్రదక్షిణ మార్గంలో 22 మార్బుల్స్ మీద కాశీ మహిమను వర్ణించే వివరాలు చెక్కారు .

ఈ కారిడార్లో 24 భవనాలు కూడా నిర్మించారు .

వీటిలో ప్రధాన ఆలయ ప్రాంగణం , ఆలయ చౌరస్తా , ముముక్షు భవన్ , యాత్రికుల వసతి కేంద్రం , షాపింగ్ కాంప్లెక్స్ , మల్టీపర్పస్ హాల్ , సిటీ మ్యూజియం , వారణాసి గ్యాలరీ , గంగా వ్యూ కెఫే రెస్టారెంట్ ఉన్నాయి . ఈ ధామ్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ప్రాంగణం చుట్టూ 5 వేలకు పైగా లైట్లు ఏర్పాటు చేశారు .

ఈ స్పెషల్ లైట్లు పగటి పూట , మధ్యాహ్నం , రాత్రి రంగులు మారుతూ ఉంటాయి . ” కారిడార్లో ఏయే సౌకర్యాలు అవసరమో వాటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాం . అంటే మ్యూజియం , వారణాసి గ్యాలరీ , ముముక్షు భవన్ , రెస్టారెంట్ లాంటివి నిర్మించాం . ఆధ్యాత్మిక గ్రంథాలు చూడాలనుకుంటే అవి వైదిక కేంద్రంలో కూడా ఉంటాయి ” అని ధాము నిర్మించిన పీఎస్పీ కంపెనీ సీఎండీ పీఎం పటేల్ చెప్పారు .

కాశీలో పండుగ వాతావరణం ఈ కారిడారు జాతికి అంకితం చేస్తుండడంతో కాశీ అంతటా పండుగ వాతావరణం నెలకొంది . ప్రభుత్వ భవనాలు , చౌరస్తాలు రంగురంగుల విద్యుత్ లైట్లతో వెలిగిపోతున్నాయి . నగరంలో ప్రజలు కూడా తమ ఇళ్లు , షాపులను అందంగా అలంకరించారు .

అక్కడక్కడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు .

డిసెంబర్ 13 న సాయంత్రం దీపావళిలా ప్రజలందరూ తమ ఇళ్లను దీపాలతో అలంకరించాలని కోరారు .

విశ్వనాథ్ కారిడార్ వరకూ వెళ్లే దారి పొడవునా అన్ని భవనాలకూ అధికారులు కాషాయ రంగు వేశారు . అయితే ఆ దారిలో ఉన్న ఒక మసీదుకు కూడా ఆ రంగు వేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి .

దీనిపై ముస్లిం సమాజం శాంతిపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు దానికి మళ్లీ తెల్ల రంగు వేశారు . దీనిని సానుకూలంగా తీసుకున్న ముస్లింలు అధికారులను ప్రశంసించారు .

ప్రభుత్వ సన్నాహాలే కాదు , నగరంలోని సామాన్యులు కూడా దీనిని ఒక వేడుకలా భావిస్తున్నారు . ” వేడుక అనేది మన సంస్కృతిలో కీలకమైన భాగం . కాశీ విశ్వనాథ్ కారిడార్ అనేది మొత్తం కాశీకే ఒక ప్రతిష్టాత్మకమైన విషయం .

మా కాశీ దేవతల దీపావళి కూడా చేస్తుంది .

ఈ సారి మేం శివ దీపావళిని జరుపుకుంటున్నాం ” అని రెస్టారెంట్ , సినీ పరిశ్రమలో ఉన్న ఆలోక్ దుబె అన్నారు . ” రెండేళ్ల క్రితం ఇక్కడికి వచ్చా , కానీ , ఈసారి ఇక్కడ వాతావరణం ఊహించని విధంగా ఉంది . విశ్వనాథ్ ధామ్ గురించి బ్లాగ్ , వీడియోలు చూశాను .

కానీ ఇక్కడికి వచ్చాక అది దానికంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నట్టు కనిపించింది . ఇంతకు ముందు ఆలయ శిఖర దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది . కానీ అన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి ” అని పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ నుంచి కాశీని చూడ్డానికి వచ్చిన మహేంద్ర గుప్తా చెప్పారు .

” శివభక్తురాలు అహిల్యాబాయి హోల్కర్ 350 ఏళ్ల క్రితం ప్రస్తుత శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని నిర్మించారు .

2 వేల చదరపు మీటర్లలో వ్యాపించిన ఆలయానికి ప్రజలు ఇరుకైన వీధుల్లో వచ్చేవారు .

ఆలయంలో చాలా తక్కువ చోటుండేది . ఇక్కడికి బలహీనులు , రోగులు , వృద్ధులు చేరుకోవడం గతంలో కష్టమయ్యేది ” అని విశ్వనాథ్ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా అర్చకులుగా పనిచేస్తున్న శ్రీకాంత్ మిశ్రా బీబీసీకి చెప్పారు .

16 లక్షల లడ్డూలు విశ్వనాథ్ ఘాట్ జాతికి అంకితమయ్యే ఈ కార్యక్రమానికి దేశంలో 3 వేల మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు .

వీరిలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటూ ఎంపీలు , ఎమ్మెల్యేలు ఉన్నారు . వారణాసిలో ఈ వేడుకలు ఒక నెలపాటు నిర్వహించనున్నారు .

దీనికి ‘ భవ్య కాశీ , దివ్య కాశీ ‘ అనే పేరు పెట్టారు .

ఈ కార్యక్రమంలో వారణాసిలో నివసించే ప్రతి వ్యక్తికీ అందేలా 16 లక్షల లడ్డూల ప్రసాదం పంచుతున్నారు . ఈ లడ్డూలను కార్యకర్తలు నేరుగా ప్రజల ఇళ్లకే చేరుస్తారు .

ప్రసాదంతోపాటూ ప్రజలకు ఒక స్మారకం కూడా ఇస్తారు . కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం కోసం దాదాపు 400 ఇళ్లు , వందలాది ఆలయాలు సేకరించారు . జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో విశ్వనాథ్ ఆలయం ఉండడంతో దాదాపు 400 ఆస్తులు కొనుగోలు చేశారు .

దాదాపు 14 వందల మందిని నగరంలో ఇతర ప్రాంతాలకు తరలించారు . దాదాపు రెండేళ్ల 8 నెలలపాటు నిర్మాణం జరిగిన ఈ డ్రీమ్ ప్రాజెక్టులో ఇప్పటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి .

ప్రస్తుతం ఈ కారిడార్లో 2600 మంది కార్మికులు , 300 మంది ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో నిరంతరం పనిచేస్తున్నారు .

ఈ కారిడార్ నిర్మాణం కోసం సేకరించిన 400 ఆస్తుల్లో 27 కాశీ ఖండోక్త్ ఆలయాలు , 127 ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి . వీటిని కూడా సంరక్షించనున్నారు . కాశీ ఖండోక్త్ ఆలయాన్ని గతంలో ఉన్నట్లు పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు . దీనిని కారిడార్లోని రెండో దశలో పూర్తి చేయనున్నారు .