కేసీఆర్ మీద అక్కసుతో సీఎం రేవంత్ జిల్లాల సంఖ్య తగ్గించాలని చూస్తున్నారు…మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్: కాంగ్రెస్ పాలనకు నెల రోజులు నిండాయని.. స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రసాదించడం గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం స్వయంగా ప్రజా దర్భార్‌లో పాల్గొన్నది ఒక్క రోజు మాత్రమేనని చెప్పారు. ప్రజా దర్బార్‌లో ఈనెల రోజుల్లో ఎంతమంది సమస్యలను పరిష్కరించారో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన పేరిట ప్రజలను బలి పశువులను చేస్తున్నారని మండిపడ్డారు. దరఖాస్తుల స్వీకరణ పేరిట ప్రజలను రోడ్ల మీదకు తెచ్చారన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15 వేల రూపాయలు ఉపాధి కల్పించే పథకం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణ దాటి పోయాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతిపై మాట మీద నిలబడుతారా లేదా సీఎం రేవంత్ స్పష్టం చేయాలన్నారు. కేసీఆర్ మీద అక్కసుతో రేవంత్ జిల్లాల సంఖ్య తగ్గించాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలఫై రేవంత్ ఏం చేసినా తేనే తుట్టెను కదిలించినట్టే అవుతుందన్నారు. రద్దు ,వాగ్ధానాలు, వాయిదాలు అనే రీతిలో కాంగ్రెస్ పాలన సాగుతోందని ప్రశాంత్‌రెడ్డి సెటైర్లు వేశారు..