పిల్లలు కూడా వీడియో గేమ్స్‌ ఆడుతూ హార్ట్‌ స్ట్రోక్‌…!!

శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడే అసలైన ఆటలకు పూర్తిగా దూరమయ్యారు. ఏ మాత్రం సమయం చిక్కినా మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లలో వీడియో గేమ్స్‌లో మునిగి తేలుతున్నారు. గంటల తరబడి వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కానీ, వీటి వల్ల పిల్లల ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది. వీడియో గేములు ఆడడం వల్ల పిల్లల్లో హృదయ స్పందన (హార్ట్‌బీట్‌) లయ తప్పి.. ప్రాణాలు పోతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా హృద్రోగాలున్నట్టు ముందుగా గుర్తించని పిల్లలకు ఈ ముప్పు అధికంగా ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనం తేల్చింది. ఇలాంటి పిల్లలు వీడియో గేమ్స్‌ ఆడుతున్నప్పుడు అసాధారణంగా స్పృహ తప్పిపోతుంటారని, అది వారి ప్రాణాలనే ప్రమాదంలోకి నెడుతుందని స్పష్టం చేసింది.
గెలుపోటములతో ఉద్వేగం..
గుండె సంబంధ సమస్యల్లేని కుటుంబాల్లోని పిల్లలు కూడా వీడియో గేమ్స్‌ ఆడుతూ హార్ట్‌ స్ట్రోక్‌తో మృతి చెందినట్టు పరిశోధకులు తేల్చారు. గేమ్‌లో ఓడిపోయినా, గెలిచినా వారు ఉద్వేగానికి గురవుతున్నారని, ఫలితంగా హృదయ స్పందన లయ తప్పుతోందని పరిశోధకులు గుర్తించారు. ‘వీడియో గేమ్స్‌.. గుండె లయ సక్రమంగాలేని పిల్లల్లో తీవ్ర ప్రమాదానికి కారణమవుతాయి. ఒక్కసారిగా గుండె ఆగిపోయేలా చేస్తాయి. వీడియో గేమ్‌ ఆడుతూ ఆడుతూ పిల్లలు కుప్పకూలిపోతారు.’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఆస్ట్రేలియాలోని ది హార్ట్‌ సెంటర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పరిశోధకులు ైక్లెర్‌ ఎం లాలీ తెలిపారు. వీడియో గేమ్స్‌ ఆడుతూ స్పృహ తప్పిపడిపోయిన పిల్లలకు తప్పనిసరిగా గుండె సంబంధ పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ అధ్యయన వివరాలు ‘హార్ట్‌ రిథమ్‌’ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.