విక్రమార్కుడు కథలు..

విసుగు చెందన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, ” రాజా, నీవు తలపెట్టిన పని నిర్విఘ్నంగా కొనసాగనందుకు విచారించకు. పూర్వకాలపు మహర్షులు చేయించిన మహత్కార్యాలకే విఘ్నాలు కలిగాయి. అందుకు తార్కాణంగా నీకు శ్వేతకేతుడు చేయించిన యజ్ఞం గురించి చెబుతాను, విను” అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.
అయోధ్యా నగరాన్ని పరిపాలించిన సూర్యవంశపు రాజులలో శ్వేతకేతు డుండేవాడు. ఆయనకు ఒక కుమార్తె మాత్రమే కలిగింది. యజ్ఞం చేసి దేవతలను తృప్తి పరిచి, ఆ విధంగా పుత్రసంతాన ప్రాప్తి కలిగేటట్టు యత్నించమని ఆయన కుల గురువైన వశిష్టుడు ఆయనకు సలహా ఇచ్చాడు. అందుకు శ్వేతకేతుడు సమ్మతించాడు.
యజ్ఞశాల నిర్మించి, యజ్ఞానికి అవసరమైన సంబరాలన్నీ సిద్దపరిచి, రాజు యజ్ఞ దీక్షలో కూర్చున్నాడు. యజ్ఞం జరిగేటంత కాలమూ యజ్ఞశాలలో ఎలాంటి అశౌచమూ ప్రవేశించరాదు. అలా ప్రవేశించినట్టయ యజ్ఞభంగం అవుతుంది. అందుచేత యజ్ఞం ప్రారంభమైనది మొదలు పూర్తి అయ్యేదాకా యజ్ఞశాలలో ఉండే ఋత్విక్కులూ, ఆధ్వర్యులూ, ఉద్గాతృలూ, హోతలూ, పురోహితులూ బయటికి వెళ్ళకుండానూ, పైవారెవయజ్ఞశాలలోకి రాకుండానూ గట్టి ఏర్పాట్లు చేశాడు. యజ్ఞశాల యొక్క ద్వారం వద్ధ అహోరాత్రులు కాపాలావాళ్ళను పెట్టారు. తరువాత, యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగించ వలసిందిగా సకల దేవతలకూ ప్రార్థనలు జరిపి, యజ్ఞం ఆరంభించారు.

యజ్ఞశాలలో ఉన్న ఋత్విక్కులలో ఖండుడనే బ్రాహ్మణుడూ, ఆయన కుమారుడు ఉన్నారు. యజ్ఞం సగంలో ఉండగా ఖండుడి దాయాది ఒకడికి ఆయువు తీరిపోయింది. అప్పుడు చిత్రగుప్తుడు యమ ధర్మరాజు వద్దకు వచ్చి, “ఈ మనిషికి ఆయుర్దాయం తీరిపోయింది. మనం ఇప్పుడితని ప్రాణాలను తెచ్చినట్టయితే, శ్వేతకేతువు చేసే యజ్ఞంలో ఒక ఋత్విక్కుగా ఉన్న ఖండుడికి మైల వచ్చి యజ్ఞానికి భంగం కలుగుతుంది. ఇంకొక వారంలో యజ్ఞం పూర్తి అవుతుంది. అంత దాకా ఖండుడి దాయాదిని బతకనిద్ధామా?” అని అడిగాడు.
యముడు కొంచెం ఆలోచించి, “మనం యజ్ఞభంగం గురించి ఆలోచించ నవసరం లేదు. మన పని మనం చేసుకుపోదాం,” అన్నాడు. చిత్రగుప్తుడు పంపగా యమ దూతలు వెళ్ళి, ఖండుడి దాయాది ప్రాణాలను తీసుకుపోయారు.
ఖండుడికీ, ఆయన కొడుక్కు మైల వచ్చింది. వారు శ్వేతాకేతుడి యజ్ఞశాలలో ఉన్నట్టు ఖండుడి భార్యకు తెలుసు. మైలతో ఉన్న తన భర్త ఋత్విక్కుడుగా ఉంటే యజ్ఞానికి భంగం కలుగుతుంది. మైల వార్త చెప్పకపోతే తనకు పాపం చుట్టుకుంటుంది. ఇలా అనుకొని ఖండుడి భార్య యజ్ఞం జరిగే చోటికి మనిషి ద్వారా మైల వార్త పంపింది.
ఈ వార్త తీసుకుపోయిన మనిషి, ఆ యజ్ఞానికి నెయ్యి అందించే రంజని. రంజని యజ్ఞశాల బయట కాపలా ఉన్న వాడికి నెయ్యి అందించి “అయ్యా, లోపల ఉన్న ఖండుడనే ఆయననూ, వారబ్బాయినీ ఒకసారి బయటకి పిలుస్తారా? వారికి ఒక మాట చెప్పాలి!” అన్నది.
“లోపలి వారు బయటకి రావటానికి వీల్లేదు. రాజు గారి ఆజ్ఞ,” అన్నాడు కాపలావాడు.
“అయితే, వారిద్దరికీ మైల వచ్చిందని కబురు చెయ్యి. వారి దాయాది ఒకరు చనిపోయారు,” అన్నది రంజని.

కాపలావాడు అదిరిపడి, “అలాంటి మాటలిప్పుడు చెప్పవంటే రాజుగారు నీ తల తీసేస్తారు. పో అవతలకి!” అని ఆమెను గద్దించాడు.
ఇదే సమయంలో యజ్ఞకుండలో నల్లని ఆకారం గల వస్తువు పడింది. అగ్ని చల్లారింది. ఎంత ఆజ్యం పోసినా ప్రయోజనం లేకపోయింది.
“అపచారం! అపచారం!” అని యాజకులు కేకలు పెట్టారు.
“మీ వల్ల ఏదో లోపం జరిగింది,” అన్నాడు రాజు.
“మా వల్ల ఏ లోపమూ జరగలేదు. కాని ఏం జరిగిందో నిదానంగా విచారించుదాం,” అన్నాడు వశిష్టుడు.
శ్రద్దగా విచారించిన మీదట, కాపలావాడి ద్వారా యజ్ఞ భంగానికి కారణం తెలిసింది. యజ్ఞశాలలో ఉన్న ఋత్విక్కులలో ఖండుడికి మైల వచ్చింది. ఈ వార్త కాపలావాడి దాకా వచ్చింది. కాని లోపలకి రాలేదు.

నీకు ఈ సంగతి తెలియగానే లోపలకి ఎందుకు కబురు చెయ్యలేదు?” అని వశిష్టుడు కాపలావాణ్ణి అడిగాడు.
“బయటి వార్త లేవీ లోపలికి రానివ్వ వద్దని మహారాజుగారు ఆజ్ఞాపించారు!” అన్నాడు కాపలావాడు.
“అవును, యజ్ఞభంగం కలుగుతుందని నేనలాంటి ఉత్తరువు చేశాను. నా యజ్ఞాన్ని దేవతలే భగ్నం చేశాడు,” అన్నాడు రాజు.
 
భేతాళుడీ కథ చెప్పి, “రాజా, నాకొక సందేహం కలిగింది. దేవతలు శ్వేతాకేతుడి యజ్ఞాన్ని ఎందుకు భగ్నం చేశారు? ఆయువు తీరిపోయిన వాణ్ణి ఒక్క వారం రోజుల పాటు బతికి ఉండ నివ్వడం యమధర్మరాజుకు అసాద్యమా? యజ్ఞానికి భంగం రాకుండా దేవతలను ప్రార్థించడం బొత్తిగా నిరుపయోగం అయింది ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “దేవతలను ప్రార్థించడం నిరుపయోగం అయ్యేటట్టు చేసుకున్నది రాజే. యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసే భారాన్ని అచ్చంగా దేవతలకే వదిలి ఉంటే, యజ్ఞం ముగిసేదాకా ఖండుడికి మైల రాకుండా యముడు చేసి ఉండ గలవాడే. కాని రాజు యజ్ఞశాలలోకి అశౌచం రాకుండా తన కట్టుదిట్టాలు తాను వేరే చేసుకొని, దేవతలకా భాద్యత లేకుండా చేశాడు. యజ్ఞ భంగానికి అసలు కారకుడు శ్వేతాకేతుడే!” అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కాలగగానే భేతాళుడు శవంతో సహ మాయమై మళ్లీ చెట్టెక్కాడు.