నాగర్‌కర్నూల్‌ యువకుడి ప్రతిభ….చప్పట్లతో కరెంట్‌ మోటర్ ఆన్, ఆఫ్‌…

R9TELUGUNEWS.Com. తన తండ్రికి జరిగిన విద్యుత్‌ ప్రమాదం తనయుడిలో నూతన ఆవిష్కరణకు ఉసిగొల్పింది. తన తండ్రికి జరిగినట్లుగా మరెవ్వరికి జరుగకూడదనే ఉద్దేశంతో నూతన పరికరాన్ని తయారు చేసి శభాష్‌ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన కర్నె కల్యాణ్ బోర్ మోటర్‌ను చప్పట్లతో ఆన్ అయ్యే పరికరాన్ని తయారు చేశాడు.

10 వ తరగతి వరకు పక్క గ్రామ మైన తోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు కున్నాడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువు తున్నాడు. గత సంవత్సరం తన తండ్రి బోరు మోటర్ ఆన్ చేసేటప్పుడు విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. చాలా బాధ పడ్డ కల్యాణ్ సెల్ ఫోన్‌తో ఆన్ ఆఫ్ అయ్యే విధంగా పరికరాన్ని తయారు చేసి స్టార్టర్‌కు బిగించాడు.

ఫోన్ స్విచ్ ఆఫ్, లేదా సిగ్నల్ లేక పోతే ఎలా అని భావించిన కల్యాణ్ శబ్ధ తరంగాలను ఉపయోగించి బోరు మోటర్‌ను ఆన్, ఆఫ్ చేసే పరికరాన్ని తయారు చేయాలని ప్రయత్నాలు చేసి సఫలం అయ్యాడు. కేవలం రూ.1300 ఖర్చుతో సోలార్ ప్యానల్, సౌండ్ సెన్సార్, సర్వో మీటర్, కేబుల్, బ్యాటరీలతో పరికరాన్ని తయారు చేసి బోరు మోటర్ స్టార్టర్‌కు బిగించాడు.

దీంతో మనకు అవసరం అయినప్పుడు స్టార్టర్ వద్దకు వెళ్లి చప్పట్లు కొడితే బోరు మోటర్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరమని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని పరిశోధనలు చేస్తానని కల్యాణ్‌ అంటున్నాడు.