వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మార్పులు: తితిదే..

తిరుమల: నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శన టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ చేస్తామని తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో మూడు ప్రదేశాల్లో సర్వదర్శన టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. తిరుపతి అలిపిరి వద్ద తితిదే ఉద్యోగులకు రూ.54 లక్షలతో నిర్మించిన ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ 20వేల నుంచి 25 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15వేల టోకెన్లు జారీ చేస్తామన్నారు. టికెట్లు లేని భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు చేయాలని నిర్ణయించామన్నారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ దర్శన సమయాన్ని మారుస్తామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. క్షురకులను నిఘా సిబ్బంది ఇబ్బంది పెట్టలేదని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపేరు..