మొదటిసారి ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీకి ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక క్రికెట్ సంఘం బెంగళూరులో భారీ ఏర్పాట్లు చేసింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీ ఎత్తున అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై సర్వత్రా తీవ్ర విచారం వ్యక్తమైంది. ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు..
తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, మాటలు రావట్లేదని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బుధవారం రాత్రి 10:45 గంటలకు ఇన్స్టాగ్రామ్లో విరాట్ పోస్ట్ పెట్టాడు. ఇందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ చేసిన ఓ ప్రకటనను రీపోస్ట్ చేశాడు. ‘మీడియా ద్వారా మాకు తొక్కిసలాట ఘటన గురించి తెలిసింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఆర్సీబీ అభిమానులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యమైనది. విషయం తెలిసిన వెంటనే మా కార్యక్రమాలను రద్దు చేసుకున్నాం. మాకు మద్దతుగా నిలిచే అందరికీ ఒకటే విజ్ఞప్తి.. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని ఆర్సీబీ పేర్కొంది….
తొక్కిసలాట జరిగినప్పటికీ, స్టేడియం లోపల కొద్దిసేపు విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఆర్సిబి కెప్టెన్ రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అయితే, బయట జరిగిన విషాదం గురించి తెలియగానే, వేడుకలను రద్దు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశించారు.
ఆర్సిబికి చారిత్రక విజయం లభించిన రోజున ఈ విషాద ఘటన జరగడం పట్ల క్రీడా లోకంలో, అభిమానుల్లో తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. భద్రతా ఏర్పాట్లపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి భారీ కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్ల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది..