కళాతపస్వి విశ్వనాధ్‌కు ప్రధాని మోదీ తో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు సంతాపం.

దర్శకుడు కె. విశ్వనాథ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. ‘కె. విశ్వనాథ్ సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం, సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకలంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కె.విశ్వనాథ్ పేరు నిలిచే ఉంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్యకావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ‍యన ఇంటికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్ద పీట వేశారని ఆయన కేసీఆర్‌ కొనియాడారు…

కళాతపస్వి కే.విశ్వనాథ్‌ ఇక లేరనే వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇది అత్యంత విషాదకరమైన రోజని, ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవన్నారు. సున్నితమైన ఆర్ట్‌ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరని చెప్పారు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు విశ్వనాథ్‌ అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈమేరకు చిరంజీవి ట్వీట్‌ చేశారు.

దర్శక యశస్వి కే విశ్వనాథ్ మరణవార్త తెలుగు రాష్ట్రాలకు, తెలుగు సినీ ప్రపంచానికి తీరని షాక్ ఇచ్చింది. విశ్వనాథ్ మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. కే విశ్వనాథ్ గారు కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని కొనియాడారు. విశ్వనాథ్ మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని..తెలుగు సంస్కృతి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారని వైఎస్ జగన్ తెలిపారు. కే విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు తెలుగు సినీ రంగానికి ఎనలేని గౌరవాన్ని అందించాయన్నారు..
భారతదేశ సినీ పరిశ్రమలో తెలుగువారి పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే. విశ్వనాథ్ గారి మరణం తీరని లోటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎన్నో మరపురాని చిత్రాలను, అనేక సందేశాత్మక చిత్రాలను రూపొందించిన గొప్ప దర్శకులు విశ్వనాథ్. విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరోవైపు కళాతపస్వి,. ప్రముఖ చలనచిత్ర దర్శకులు కే.విశ్వనాథ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కే.విశ్వనాథ్ మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటన్నారు. శంకరాభరణం చిత్రంతో చిత్ర రంగం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహా గొప్ప నటుడు, దర్శకులు కే. విశ్వనాథ్ అని కొనియాడారు. ఆయన మరణంతో చిత్రరంగం చిన్నబోయిందని.. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి కలుగజేయాలని ప్రార్థిస్తున్నానన్నారు..