‘డి విటమిన్’ లోపం ముందస్తు మరణానికి దారి…!!!

విటమిన్‌ డీ లోపం ముందస్తు మరణానికి దారితీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. తగిన స్థాయిలో విటమిన్‌ డీ ఉండేలా చూసుకోవాలని సూచించింది. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. విటమిన్‌ డీ లోపం ఎంత ఎక్కువ అయితే, మరణ ముప్పు అంత పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఎముకలు, కండరాలు బలంగా ఉండేందుకు విటమిన్‌ డీ దోహదపడుతుంది..

ఏ విటమిన్ లోపం ఏర్పడినా.. ఏదొక వ్యాధిబారిన పడతారు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి డి విటమిన్ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. కండ‌రాలు బ‌లంగా ఉండాల‌న్నా, ఎముకలకు అవసరమైన క్యాల్షియంను శ‌రీరం గ్ర‌హించాల‌న్నా, ఇన్ఫెక్షన్ల బారిన ప‌డ‌కుండా ఉండాల‌న్నా, మెద‌డు స‌రిగ్గా ప‌ని చేయాల‌న్నా, రోగ నిరోధక వ్యవస్థ స్ట్రోంగ్‌గా ఉండాల‌న్నా విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం. ఈ విటమిన్ సహజంగా లభిస్తుంది. చర్మానికి సూర్యరశ్మి
(​అతినీలలోహిత కిరణాలు) సోకినపుడు తయారుచేయబడుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎక్కువమంది విటమిన్ ‘డి’ లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణం రోజు రోజుకు ఎండకు దూరంగా జీవించడమే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనుక డి లోపాన్ని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఏర్పడవు. కనుక డి లోపాన్ని గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం..
చిన్న చిన్న పనులకే అలసటకు గురికావడం.. తీవ్రమైన నీర‌సం, శరీరం బలహీనంగా మారడం, ఏ ప‌ని చేసే ఆసక్తి లేకపోవడం, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, త‌ల‌నొప్పి వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తుంటే.. డి విటమిన్ లోపంఏమో అని ఆలోచించాల్సి ఉంటుంది.

*చ‌ర్మం తేమని కోల్పోవడం.. డ్రై అయినట్లు మారడం.. త‌ర‌చూ ప‌గుళ్లు రావ‌డం వంటి లక్షణాలు కూడా డి విటమిన్ లోపాన్ని సూచిస్తాయి.

* చిన్న చిన్న పనులకే ఎముక లేదా కండరాల నొప్పి బారిన పడుతుంటే డి విటమిన్ తీసుకోవడం పై దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

*త‌ర‌చూ అనారోగ్యానికి గురికావ‌డం, మానసిక ఒత్తిడి, తీవ్ర ఆందోళన కలుగుతుంటే.. డి విటమిన్ గురించి ఆలోచించాలని అంటున్నారు.

* ఉన్న‌ట్టు ఉండి బ‌రువు పెర‌గ‌డం, న‌డుము నొప్పి, హెయిర్ ఫాలో అధికంగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తే డి విటమిన్ లోపం ఏమో ఒక్కసారి చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తగిన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

ఈలక్షణాలు తరచుగా కనిపిస్తే.. ఉదయం, సాయంత్రం ఎండలో ఒక గంట నిల్చోవాలని చెబుతున్నారు. ఇక తినే ఆహారంలో కోడి గుడ్డు, చేపలు, రొయ్యలు, చీజ్, పన్నీర్, పెరుగు వంటి పాల పదార్ధాలు, బాదాం, గోధుమలు, రాగులు, ఓట్స్, పుట్టగొడులను చేర్చుకోవాలని చెబుతున్నారు. ఈ ఆహారపదార్ధాల్లో డి విటమిన్ ఉంటుందని కనుక తినే డైట్ లో వీటిని చేర్చుకుంటే.. డి విటమిన్ లోపాన్ని సవరించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చని సూచిస్తున్నారు..