వీఆర్ఓల సంఘం కీలక సమావేశం.. సీఎంకు అల్టీమేటం..

R9TELUGUNEWS.COM.
రాష్ట్రంలో 5,485 వీఆర్వో పోస్టులను రద్దు చేసి 15 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మండిపడింది. కనీసం ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండా, సంఘాల నాయకులతో మాట్లాడకుండా ఏకపక్ష నిర్ణయంతో గతేడాది సెప్టెంబర్ 9న అనాలోచిత నిర్ణయంతో వీఆర్వోలు పోస్టులు రద్దు చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు కల్పించకుండా, ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా, కారుణ్య నియామకాలు చేపట్టకుండా, చనిపోయిన కుటుంబాల గోసను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నదని సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాదులో వీవీ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్ మాట్లాడుతూ..

ఇంకెన్నాళ్లు ఈ వైఖరి కొనసాగిస్తారో అర్థం కాదడం లేదన్నారు. వందల సార్లు ఉన్నతాధికారుల అపాయింట్మెంట్ కోరుతున్నా ఒక్క రోజన్నా తమ సమస్యలు వినటానికి ఆహ్వానించడం లేదన్నారు. ఎక్కడున్నది మానవత్వం అని ప్రశ్నించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛగా బతికే అవకాశం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వెనుకబడిన ఓసీ కులాల ఉద్యోగుల అభివృద్ధి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు చట్టం ప్రకారం నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖను బలోపేతానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ తప్పదని ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె పాటి నరేష్, సహాధ్యక్షుడు కాందారి భిక్షపతి, ఉపాధ్యక్షులు మౌలానా, రామేశ్వర రావు, ఆశన్న, రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, కల్చరల్ సెక్రెటరీ రాంచందర్, రాష్ట్ర నాయకులు రాజన్న, మురళి, జాయింట్ సెక్రటరీ వెంకటేష్, కోశాధికారి రమేష్, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

సమావేశం డిమాండ్లు ఇవే...

* డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లుగా, తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించాలి. దాని ద్వారా కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించే అవకాశం ఉన్నది.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ఉద్యోగుల రిజర్వేషన్ ని అమలు చేసి పదోన్నతి కల్పించాలి.
* వీఆర్ఏల స్కేలును వెంటనే అమలు చేయాలి.
* వీఆర్వో పోస్టులు రద్దయినందున వీఆర్ఏలకు రావలసిన పదోన్నతులు రాక నష్టపోయారు. వారికి సరిసమానమైన హోదా కల్పిస్తూ స్కేల్ ఇవ్వాలి.
* పది జిల్లాలో పని చేస్తున్న క్యాడర్ను ఇప్పుడు 33 జిల్లాలకు విభజించారు. 33 జిల్లాల కోసం అమలు చేయాలి.
* రెవెన్యూ శాఖకు సీసీఎల్ఎ పోస్టు ఇప్పటి వరకు భర్తీ చేయకుండా ఇంచార్జి వ్యవస్థను నడిపిస్తున్నారు. వెంటనే భర్తీ చేయాలి.
* రద్దయిన వీఆర్వోలందరూ అనధికారికంగా అప్పుడు చేసిన పని కన్నా విపరీతమైన పని భారంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి రావలసిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కల్పించాలి.