వీఆర్‌వో వ్యవస్థ రద్దు విధాన నిర్ణయం..తదుపరి విచారణ మార్చి 9వ తేదీకి వాయిదా..

వీఆర్‌వో వ్యవస్థ రద్దు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టుకు తెలంగాణ సర్కారు నివేదించింది. వీఆర్‌వో వ్యవస్థ రద్దు, వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ వీఆర్వో వ్యవస్థను చట్టప్రకారమే రద్దు చేసినట్లు కోర్టుకు వివరించారు.పోస్టులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని, దాన్ని సవాలు చేసే హక్కు ఉద్యోగికి లేదు అన్నారు. వీఆర్వోల వేతనం, స్థాయి తగ్గకుండా వారిని ఇతర శాఖల్లో నియమించినట్లు చెప్పారు. రెవెన్యూ రికార్డుల్లో పారదర్శకత కోసం డిజిటలైజేషన్‌ ప్రక్రియ చేపట్టినందున వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది.