వైట్‌ హౌస్‌లో ‘నాటు నాటు’ ప్రస్తావన..!

వైట్‌ హౌస్‌లో ‘నాటు నాటు’ ప్రస్తావన..!

*వైట్‌ హౌస్‌. శ్వేతసౌధంలో భారత ప్రధాని మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో సరదా సన్నివేశాలు చోటుచేసుకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన తాతగారు చెప్పిన మాటలను అతిథులతో పంచుకున్నారు..

‘టోస్ట్‌’ సంప్రదాయాన్ని ఎలా పాటించాలనే దానిపై అధ్యక్షుడు బైడెన్‌ ప్రధాని మోదీకి వివరించారు. అధికారిక విందు సందర్భంగా జో బైడెన్‌ టోస్ట్‌కు పిలుపునిచ్చే సమయంలో మాట్లాడుతూ ”మిస్టర్‌ పీఎం.. మీరు ఆల్కహాల్‌ తీసుకోకపోతే ఎడమ చేత్తో టోస్ట్‌ గ్లాస్‌ తీసుకోవాలి. ఈ విషయాన్ని మా తాతయ్య ఆంబ్రోస్‌ ఫెన్నిగాన్‌ చెప్పేవారు. నేను జోక్‌ చేయడంలేదు. జిల్‌, నేను నేడు ప్రధాని మోదీతో అద్భుతంగా గడిపాం. ఇది చాలా ఫలవంతమైన పర్యటన. ఈరోజు రాత్రి అమెరికా- భారత్‌ మధ్య ఉన్న గొప్ప మైత్రిని గౌరవించుకొంటున్నాం” అని పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ పక్కనే కుడిచేత్తో గ్లాస్‌ పట్టుకొని నవ్వుతూ ఉండిపోయారు.

శ్వేతసౌధంలో అధికారిక విందు సందర్భంగా ప్రధాని మోదీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ఆస్కార్‌ గెలుపొందిన ‘నాటు నాటు’ పాటను ప్రస్తావించారు. ”గడిచే ప్రతి రోజునూ.. భారత్‌, అమెరికన్లు పరస్పరం మరింత మెరుగ్గా అర్థం చేసుకొంటున్నారు. హాలోవిన్‌ రోజున భారత్‌లో పిల్లలు స్పైడర్‌మెన్‌గా మారిపోతున్నారు. మరోవైపు అమెరికాలో యువత ‘నాటు నాటు’ ట్యూన్లకు స్టెప్పులేస్తున్నారు” అని పేర్కొన్నారు..