వరంగల్‌లో మరో మెడికో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం?..

వరంగల్ జిల్లా :జూన్ 24
వరంగల్ జిల్లాలో మరో మెడికో విద్యార్థిని శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. కేఎంసీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న లాస్య నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించింది. వెంటనే విద్యార్థినిని ఎంజీఎంకు తరలించగా.. వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర సంచలనం రేపుతోంది.

ఈ ఘటనపై కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. మెడికో విద్యార్థినిది ఆత్మహత్యాయత్నం కాదని స్పష్టం చేశారు. విద్యార్థిని లాస్య చాలా కాలంగా మైగ్రేన్‌తో బాధపడుతున్నారని.. దానికి సంబంధించి మెడిసిన్ వాడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం మైగ్రేన్‌కు సంబంధించిన మెడిసిన్‌ను రెండు సార్లు వేసుకోవడంతో తోటి స్నేహితులు ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. సీనియర్ విద్యార్థులు వేధింపులు ఏమీ లేవని మోహన్ దాస్ తెలిపారు.

ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మైగ్రేన్‌ వల్ల మెడిసిన్ వేసుకున్నట్లు మెడికో తెలిపారని, విద్యార్థిని పరిస్థితి బాగుందని తెలిపారు. కేవలం అబ్జర్వేషన్‌ కోసమే ఆస్పత్రిలో ఉంచినట్లు చెప్పారు…