వాటర్ బాటిల్ అడిగితే యాసిడ్ బాటిల్..ఆసుపత్రి పాలైన విద్యార్థి..

వ్యాపారి నిర్వాకం..
వాటర్ బాటిల్ అడిగితే యాసిడ్ బాటిల్..
ఆసుపత్రి పాలైన లయోలా విద్యార్థి..
లయోలా కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న చైతన్య…ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థి..చికిత్సకు అవసరమైన నిధులు సేకరిస్తున్న కాలేజీ యాజమాన్యం..!!!
..
వ్యాపారి నిర్వాకం ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన కోసూరు చైతన్య లయోలా కళాశాలలో ఏవియేషన్ విభాగంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఎనికేపాడు వద్ద ఓ దుకాణంలో వాటర్ బాటిల్ కొన్నాడు. దుకాణ యజమాని వాటర్ బాటిల్‌కు బదులుగా యాసిడ్ నింపి ఉన్న బాటిల్‌ను ఇచ్చేశాడు. 

దాహంతో ఉన్న చైతన్య వెంటనే తాగేశాడు. తాగింది యాసిడ్ అని తెలుసుకునే సరికే అది లోపలికి వెళ్లిపోయింది. విలవిల్లాడిన చైతన్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యాసిడ్ తన ప్రభావం చూపించింది. శరీరంలోని అవయవాలు స్వల్పంగా పాడయ్యాయి. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో చైతన్య ఆసుపత్రి ఖర్చులను భరించేందుకు లయోలా కాలేజీ ముందుకొచ్చింది. ఇందుకోసం విరాళాలు సేకరిస్తోంది.