రెండు తెలుగురాష్ట్రాలకు వాతావరణ సూచన..!!

గత అప్డేట్ లో తెలిపిన విధంగా, గత 4-5 రోజులుగా కోస్తాంధ్ర మరియు వీటికి ఆనుకొని ఉన్న తెలంగాణ (సింగరేణి రీజియన్), రాయలసీమ జిల్లాల్లో చాలాచోట్ల సాధారణం కన్నా 4-5 డిగ్రీలు అధికంగా నమోదయ్యింది.
వేసవికాలం-2022 ముగింపు దశకు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న సాయంత్రం/రాత్రి నుండి నైరుతి రుతుపవనాల ముందస్తు వర్షాలు కురవడం మొదలవడంతో, ఈ రోజు నుండి క్రమంగా రెండు తెలుగురాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.అలాగే జూన్ రెండోవారం మొదట్లో దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూలమైన వాతావరణం ఉండటంతో, మనకు వేసవికాలం-2022 దాదాపు ముగింపు దశకు వచ్చిందని చెప్పవచ్చు.

*రెండు తెలుగురాష్ట్రాల్లో మొదలైన నైరుతి రుతుపవనాల ముందస్తు వర్షాలు*

గత అప్డేట్ లో తెలిపిన వాతావరణ వివరాల ప్రకారం, కొన్ని గంటలు ముందుగానే అనగా నిన్న సాయంత్రం/రాత్రి నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ (హైదరాబాద్ సహా), కోస్తాంధ్ర (అమరావతి/విజయవాడ సహా), రాయలసీమ జిల్లాల్లో చాలాచోట్ల గాలి దుమారాలతో కూడిన ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురవడం మొదలయ్యింది.
నిన్న సాయంత్రం/రాత్రి నుండి తూర్పు, దక్షిణ తెలంగాణా, రాయలసీమ జిల్లాల నుండి మొదలయిన వర్షాలు ప్రస్తుతం కోస్తాంధ్ర జిల్లాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ వర్షాలు వచ్చే 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది.

*పశ్చిమ-నైరుతి దిశలో బలమైన ఉపరితల ఈదురుగాలుల సూచన*

నైరుతి రుతుపవనాలు రెండు తెలుగురాష్ట్రాలలోకి ప్రవేశించే వరకు, దాదాపు అన్ని ప్రాంతాలలో రాత్రి నుండి ఉదయం వరకు పశ్చిమ-నైరుతి దిశలో గంటకు 45-55 కి.మీ వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

జూన్ రెండోవారం మొదట్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోకి నైరుతి రుతపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.

నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండటంతో రెండు తెలుగురాష్ట్రాల్లో, జూన్ 9 నుండి వారం/పది రోజుల వరకు మరింతగా పెరగనున్న వర్షపాతం. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడే అవకాశం ఉంది.