బ్రౌజింగ్‌ హిస్టరీ డిలీట్‌ చేస్తున్నారా?…

బ్రౌజింగ్‌ హిస్టరీ డిలీట్‌ చేస్తున్నారా?

అలా చేస్తేనే మీకు సంబంధించిన డేటా భద్రం

లేదంటే మీ వివరాలు సైబర్‌ నేరగాళ్లకు చిక్కినట్లే

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్‌ దాడులు

సైబర్‌ నేరాలపై రాష్ట్ర పోలీసుల ప్రచారం ముమ్మరం

మీరు రోజూ ఆన్‌లైన్‌లో ఎంతసేపు గడుపుతున్నారు? ఎన్ని వెబ్‌సైట్లు చూస్తున్నారు? ఏయే కార్యకలాపాలు నిర్వహించారు.. తదితర వ్యవహారాలన్నీ మన బ్రౌజింగ్‌ హిస్టరీలో ఉంటాయి. అయితే ఇకపై ఎప్పటికప్పుడు మీ బ్రౌజింగ్‌ హిస్టరీని పూర్తిగా డిలీట్‌ చేసుకోండి. ముఖ్యంగా పర్సనల్‌ కంప్యూటర్‌ కాకుండా వేరేచోట్ల కంప్యూటర్‌ వాడాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఈ పని చేయాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా మీ డేటా, బ్యాంకు ఖాతాల్లో సొమ్మును కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్‌ దాడులు, ఆన్‌లైన్‌ నేరాలు, మోసాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండేందుకు పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొంతకాలంగా మ్యాజిక్‌వీల్, జాబ్స్, లోన్, డీమార్ట్‌ ఆఫర్లు, వాలెంటైన్స్‌ డే గిఫ్టులు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ల పేరిట అనేక మోసాలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌ అనంతరం డేటా వినియోగం పెరగడంతో సైబర్‌ నేరగాళ్ల అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా సృష్టించిన అనివార్య పరిస్థితుల కారణంగా అవసరం లేని వారు కూడా స్మార్ట్‌ఫోన్‌ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో సైబర్‌ మోసాల పాలిట పడే బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తం చేసేందుకు తెలంగాణ పోలీసులు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారానికి తెరతీశారు. సైబర్‌ కేసుల దర్యాప్తును అదనపు సిబ్బందిని వినియోగించుకునేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. 2020లో 4,544 సైబర్‌ కేసులు నమోదవడంతో ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలోనూ సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, సా మాజిక ఖాతాల ద్వా రా సైబర్‌ మోసా లపై లఘు చిత్రాలు, నేరాల గురించి వివ రించే పోస్టులను ప్ర జలకు చేరువయ్యే లా షేర్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
మొబైల్‌ ఫోనే మోసగాళ్ల ఆయుధం..
లాక్‌డౌన్‌ తర్వాత సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తెలంగాణలోనూ కరోనా భయానికి భౌతికదూరం పాటించడం, కరెన్సీ వినియోగం తగ్గించడంతో ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగిపోయాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న నేరగాళ్లు మొబైల్‌ఫోన్ల ద్వారా అమాయకులకు ఎరవేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల వద్ద నమోదవుతున్న నేరాల్లో 90 శాతం మొబైల్‌ ఫోన్ల ఆధారంగానే జరుగుతున్నాయి. అందుకే ప్రతి మొబైల్‌ వినియోగదారుడు కింది జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

యాప్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. అవి మీ కాంటాక్ట్స్, ఫోన్, వీడియోలు, ఇతర యాప్‌లపై అజమాయిషీ అడుగుతుంటాయి. అలాంటి వాటిని తిరస్కరించండి. లేకపోతే వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి.
ప్రతి మొబైల్‌లోనూ భద్రతా యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇవి మీ మొబైల్‌లోని ప్రతి యాప్‌ను తనిఖీ చేస్తుంది. దురదృష్టవశాత్తూ మీ ఫోన్‌ పోయినా, ఎవరైనా దొంగిలించినా.. దాన్ని తిరిగి కనిపెట్టడంలో కూడా ఇవి సాయపడుతాయి.
మీ మొబైల్‌ లేదా వాట్సాప్‌ లేదా ఈ–మెయిల్‌కి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బహుమతులు, హాలీడే ట్రిప్పులు, అనుమానాస్పద యూఆర్‌ లింకులు పంపిస్తుంటారు. వీటిని క్లిక్‌ చేయకండి. చేస్తే దొంగల చేతికి తాళం చెవి ఇచ్చినట్లే.
మీ బ్రౌజింగ్‌ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్‌ చేయండి. దాని వల్ల మీ డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌ భద్రంగా ఉంటాయి.
ఉచిత వైఫైలు వాడకండి. అలాంటి వైఫైల కారణంగా మన ఫోన్‌ మనకు తెలియకుండానే సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.
ఎనీ డెస్క్‌, టీం వ్యూయర్‌ లాంటి యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్‌ చేయకండి. ఎందుకంటే సైబర్‌ నేరగాళ్లు వీటి సాయంతో మీ ఖాతాలను క్షణాల్లో ఖాళీ చేయిస్తారు.