మే 9న నూతన సీఎం ప్రమాణ స్వీకారం..

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అక్కడ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు గానూ 207 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మెజారిటీని దక్కించుకున్న బీజేపీ… తృణమూల్ కాంగ్రెస్ యొక్క 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది. బెంగాల్‌లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్టుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ రోజున నూతన సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం… పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కీలక బాధ్యతలు అప్పగించింది. బెంగాల్‌లో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడి (ముఖ్యమంత్రి) ఎన్నికకు సంబంధించి అమిత్‌షాను కేంద్ర పరిశీలకునిగా నియమించింది. కో-అబ్జర్వర్‌గా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వ్యవహరింనున్నారు. అయితే ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్‌ల మధ్య జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు పార్టీ అగ్ర నాయకత్వం, కేంద్ర పరిశీలకులు మరియు రాష్ట్ర నాయకుల నుండి వచ్చే అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రిని నియమించే విషయాన్ని కూడా పార్టీ పరిశీలించవచ్చు.

ఈ నేపథ్యంలో బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజా సమీకరణాల ప్రకారం పలువురు నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు… ఆ వివరాలు ఇలా ఉన్నాయి…సువేందు అధికారి బెంగాల్ రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్నారు. నందిగ్రామ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటుగా భవానిపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి… బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఒక కీలక వ్యక్తిగా నిలిచారు. అయితే మమతా బెనర్జీని ఢీకొట్టడం, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండటంతో… సువేందు అధికారి ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారనే విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనా అని అడిగిన ప్రశ్నలకు సువేందు అధికారి స్పందిస్తూ… తనలో ఎటువంటి మార్పు లేదు, తనకు అధికారం పట్ల ఆశ లేదని పేర్కొన్నారు.

అధికారి తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. 1995లో కాంతి మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1998లో ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2006లో కాంటాయ్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం నందిగ్రామ్‌లో ప్రతిపాదించిన రసాయన కేంద్రానికి వ్యతిరేకంగా 2007లో జరిగిన భూ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ ఉద్యమమే రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. ఆయన 2009లో తమ్లుక్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2014లో మరోసారి అక్కడి నుంచి విజయం సాధించారు.

2016లో సువేందు అధికారి రాష్ట్ర రాజకీయాలకు తిరిగి వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై నందిగ్రామ్ నుంచి విజయం సాధించి… మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే 2020 డిసెంబర్‌లో టీఎంసీని వీడిన ఆయన బీజేపీలో చేరారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు.