ఇతరుల ప్రొఫైల్ పిక్ స్క్రీన్ షాట్స్ తీయకుండా అడ్డుకట్ట.. కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్!..

ఇతరుల ప్రొఫైల్ పిక్ స్క్రీన్ షాట్స్ తీయకుండా అడ్డుకట్ట.. కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్!

బీటా వర్షన్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టు చేస్తున్న వాట్సాప్

పిక్‌ను పొటో తీసేందుకు ట్రై చేస్తే స్క్రీన్ షాట్స్ సాధ్యం కాదంటూ నోటిఫికేషన్లు

వెబ్ వర్షన్‌లో చాట్‌లను సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసేందుకు మరో ఫీచర్ పరిశీలన..

యూజర్ల సమాచార గోప్యతను మరింత పటిష్ఠపరిచేలా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇతరుల వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌ను స్క్రీన్ షాట్ తీసుకునేందుకు అవకాశం లేకుండా చేసే ఈ ఫీచర్‌ను బీటా వర్షెన్‌లో పరిశీలిస్తోంది. బీటా వర్షెన్ వాడుతున్న వారు ఈ స్క్రీన్ షాట్స్ కోసం ప్రయత్నిస్తే.. దీనికి అవకాశం లేదంటూ వాట్సాప్ నోటిఫికేషన్ పంపిస్తోందట. అనుమతి లేకుండా ఫొటోలు తీసి షేర్ చేసే ట్రెండ్‌కు వీలైనంతగా బ్రేకులు వేసేందుకు వాట్సాప్ ఈ నూతన ఫీచర్‌ను పరీక్షిస్తోంది.

స్నాప్‌చాట్, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్‌లలో ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించే సందర్భాల్లో ఈ యాప్స్ యూజర్లను ఇతరుల పిక్స్‌ను స్క్రీన్ షాట్ తీసేందుకు అనుమతించవు. దీంతో, కీలకసమాచారం చోరీ అయ్యే అవకాశం తగ్గుతుందని వాట్సాప్ చెబుతోంది. మరి కొన్ని వారాల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు, వాట్సాప్‌ వెబ్ వర్షన్ వినియోగదారులు తమకు నచ్చిన చాట్స్‌ను ఇతరులకు కనబడకుండా దాచుకునేలా ఓ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ టెస్టు చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన చాట్‌లకు ఓ పాస్‌వర్డ్‌తో ఎవరికీ కనబడకుండా లాక్ చేసుకోవచ్చు..