క‌దులుతున్న బ‌స్సులో అత్యాచారం..

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు వావి వరస, చిన్న పెద్ద తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరి కామవంచకు ముక్కు పచ్చలారని చిన్నారులు బలవుతున్నారు….
ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న మహిళపై కదులుతున్న బస్సులో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు…
సూర్యాపేట సమీపంలో ఈ ఘటన జరగ్గా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి (29) హైదరాబాద్‌లో బేబీ కేర్ టేకర్‌గా పనిచేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి మాదాపూర్‌లో ఉంటుండగా, ఆమె భర్త వేరుగా ఉంటున్నాడు. సొంతూరు వెళ్లేందుకు ఈ నెల 23న కూకట్‌పల్లిలో ప్రైవేటు స్లీపర్ బస్సు ఎక్కారు. తనకు కేటాయించిన చివరి సీటులో నిద్రపోతుండగా అర్ధరాత్రి 12.30 గంటలు దాటింది…బస్సు సూర్యాపేట దాటింది. బస్సును మరో డ్రైవర్ నడుపుతుండగా, రాజేశ్ (35) అనే ఇంకో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం గమ్యం చేరుకున్నాక ఆమె బస్సు దిగుతుండగా మరోమారు బెదిరించి బాధితురాలి వద్ద ఉన్న రూ. 7 వేల నగదును లాక్కున్నాడు. నిన్న తిరిగి హైదరాబాద్ చేరుకున్న బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి హాజరై తిరిగి వస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ కాన్వాయ్‌ను కూకట్‌పల్లి వద్ద అడుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.