బుల్లి వలస పిట్ట 13,560 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు..!
ఏకంగా 13వేల 560కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది..
బుల్లి వలస పిట్ట 13,560 కిలోమీటర్లు ఏకబిగిన ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. విశ్రాంతి, ఆహారం లేకుండా నాన్‌స్టాప్‌గా 11 రోజులు ప్రయాణించి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది.లిమోసా ల్యాపోనికా జాతికి చెందిన బార్ టెయిల్డ్ గాడ్విట్ అనే చిన్న పక్షి అమెరికాలోని అలాస్కా వద్ద నోమ్ తీరం నుంచి గతేడాది అక్టోబర్ 13న బయలుదేరి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వద్ద ఆన్‌సాన్స్ తీరం వరకు ప్రయాణించి ఈ రికార్డు సాధించింది.బహుదూరపు ప్రయాణానికి సిద్ధమైందిలా..
అలాస్కాలో బార్ టెయిల్డ్ గాడ్విట్ జాతికి చెందిన వలస పక్షులు (చిన్న వాటికి) మూడింటికి గతేడాది అక్టోబర్‌లో మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్నిథాలజీ సైంటిస్టులు తమ బర్డ్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 5 గ్రాముల బరువుండే సోలార్ శాటిలైట్ ట్రాన్స్మిటర్లను అమర్చారు. ఐదు నెలల వయసున్న బీ6 (పక్షికి సైంటిస్టులు పెట్టిన పేరు) కూడా అందులో ఉంది. అయితే వలస వెళ్లిన మిగిలిన రెండు పక్షుల జాడ తెలియలేదు.
కాగా, వలసకు సమయం ఆసన్నమైన తరుణంలో ఆ పక్షులు తమ శరీరాన్ని ప్రయాణానికి సిద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. అనవసరమైన బరువును తగ్గించేందుకు జీర్ణ వ్యవస్థ సహా కొన్ని అవయవాలను కుదించుకున్నాయి. శక్తిని ఆదా చేసేందుకు తక్కువ పీడనం ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉన్న గాలులు వీచే వరకు ఎదురు చూశాయి. అన్నీ అనుకూలంగా మారిన తర్వాత ఎగరడం ప్రారంభించాయి.