వరల్డ్ కప్ క్రికెట్ లో ఆస్ట్రేలియా బోణీ..

వరల్డ్ కప్-2023లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది.
సోమవారం లక్నోలోని అటల్ బీహారి వాజ్‌పేయ్ స్టేడియంలో శ్రీలంక, ఆస్ట్రేలియా తలపడ్డాయి…ఈ మ్యాచ్‌లో ఆసీస్ శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఈ వరల్డ్ కప్‌లో తొలి విజయం నమోదు చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు నిస్సాంక 61, కుశాల్ పెరీరా 78 పరుగులతో మంచి ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు ఔట్ అయిన తర్వాత శ్రీలంక కుప్పకూలింది. లంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. కెప్టెన్ మెండిస్ 9, సమరవిక్రమ 8, అసలంకా 25, డి సిల్వ 7, వెల్లలాగే 2, కరుణరత్నే 2, తీక్షణ 0, లాహిర్ కుమార 4, మధుశంక 0 పరుగులు చేయడంతో శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ జంపా 4 వికెట్లు తీసి శ్రీలంక నడ్డి విరిచాడు. స్టార్క్, కమ్మిన్స్ చెరో 2 వికెట్లు తీయగా.. మాక్స్ వెల్ ఓ వికెట్ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 210 పరుగులు మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 52 హాఫ్ సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. స్టార్ బ్యాటర్ స్మిత్ డకౌట్ అయ్యాడు. యంగ్ బ్యాటర్ లబుషేన్ 40, ఇంగ్లిస్ 58 పరుగులు చేసి ఆసీస్‌ను రేస్‌లో నిలబెట్టారు. చివర్లో మ్యాక్స్ వెల్ 31, స్టోయినిస్ 20 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు తొలి విజయాన్ని అందించారు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 3 వికెట్లు, వెల్లలాగే ఓ వికెట్ సాధించాడు..

. 3 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి విజయం. అంతకు ముందు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. శ్రీలంకకు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ విజయంతో కంగారూ జట్టు పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరుకోగా, శ్రీలంక 9వ ర్యాంక్‌లో ఉంది.