వరల్డ్ కప్ క్రికెట్ లో అనూహ్య ఘటన…

వరల్డ్‌కప్‌-2023.. ఢిల్లీ.. అరుణ్‌జైట్లీ స్టేడియం.. శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌.. ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన రెండు జట్ల మధ్య పోటీ..
పాయింట్ల పట్టికలో టాప్‌-7లో నిలిచి చాంపియన్స్‌ ట్రోఫీ బరిలో నిలవాంటే… అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పైచేయి సాధించాల్సిందేనన్న పట్టుదలతో బరిలోకి దిగాయి. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

ఓ బ్యాటర్ అవుటైన తర్వాత మరో బ్యాటర్ క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌కి సిద్ధమవ్వడానికి టీ20ల్లో 2 నిమిషాలు, వన్డే, టెస్టుల్లో 3 నిమిషాల నిర్దిష్ట సమయం ఉంటుంది. ఈ లోగా బ్యాటర్ సిద్ధం కాకపోతే అతన్ని టైమ్ అవుట్‌గా ప్రకటించి, అవుటైనట్టు ప్రకటిస్తారు. ఈ రూల్‌ని వాడుకున్న బంగ్లాదేశ్, మాథ్యూస్‌ని బ్యాటింగ్ చేయనివ్వకుండానే పెవిలియన్ చేర్చింది..

టైమ్ అవుట్ కోసం అప్పీల్ చేయగానే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దగ్గరికి వెళ్లి, హెల్మెట్ గురించి చెప్పేందుకు ప్రయత్నించాడు ఏంజెలో మాథ్యూస్. అయితే బంగ్లా కెప్టెన్ మాత్రం మాథ్యూస్‌ని పట్టించుకోలేదు. దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి…

లంక ఓపెనర్‌ కుశాల్‌ పెరీరాను 4 పరుగులకే పెవిలియన్‌కు పంపి బంగ్లాకు శుభారంభం అందించాడు పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌(19)ను షకీబ్‌ అవుట్‌ చేశాడు.
లంక ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ రెండో బంతికి.. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు.. సమరవిక్రమ షకీబ్‌ బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

హైడ్రామా మొదలైంది అప్పుడే
దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక వ్యూహాత్మకంగా ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ను బరిలోకి దింపింది. కానీ దురదృష్టవశాత్తూ మాథ్యూస్‌ రాంగ్‌ హెల్మెట్‌ వెంట తెచ్చుకున్నాడు.

క్రీజులోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్‌ పొజిషన్‌ తీసుకోకముందే ఈ విషయాన్ని గమనించిన అతడు.. వేరే హెల్మెట్‌ కావాలంటూ డ్రెస్సింగ్‌రూం వైపు సైగ చేశాడు. సబ్‌స్టిట్యూట్‌ కరుణరత్నె వెంటనే హెల్మెట్‌ తీసుకుని మైదానంలోకి వచ్చాడు.

షకీబ్‌ బుర్ర పాదరసంలా పనిచేసింది!
ఇదంతా జరగడానికి రెండు నిమిషాలకు పైగా సమయం పట్టింది. అప్పుడే షకీబ్‌ బుర్ర పాదరసంలా పనిచేసింది. అంతర్జాతీయ క్రికెట్‌ నిబంధనలకు అనుగుణంగా.. మాథ్యూస్‌ విషయంలో ‘టైమ్డ్‌ అవుట్‌’కి అప్పీలు చేశాడు. అంతేకాదు ఈ నిబంధన అమలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టాడు.

ప్రయత్నం చేయకుండానే వికెట్‌
దీంతో అంపైర్లు ఏంజెలో మాథ్యూస్‌ అవుటైనట్లు ప్రకటించారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వికెట్‌ దొరికిన సంబరంలో బంగ్లాదేశ్‌ మునిగిపోగా.. ఈ అనూహ్య ఘటనతో శ్రీలంక శిబిరంలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది.

. శ్రీలంక అయోమయం
ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ బ్యాటర్‌ ‘టైమ్డ్‌ అవుట్‌’గా వెనుదిరగడం ఇదే తొలిసారి. అలా.. నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమైనందున ఏంజెలో మాథ్యూస్‌ ఈ ‘శిక్ష’ అనుభవించకతప్పలేదు..
బతిమిలాడినా కరుణించలేదు
హెల్మెట్‌ కారణంగా జరిగిన తాత్సారం మూలంగా అతడు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంపైర్లు, షకీబ్‌ దగ్గరికి వెళ్లి మరీ విషయం ఏమిటో వివరించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మాథ్యూస్‌ బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నట్లు షకీబ్‌ నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయాడు.

అప్పీలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగిపోయాడు. శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ సైతం బంగ్లాదేశ్‌ కోచ్‌ చండిక హతుర్‌సింఘతో ఈ విషయం గురించి చర్చించాడు. ఫోర్త్‌ అంపైర్‌ దృష్టికి కూడా విషయాన్ని తీసుకువెళ్లారు.

తప్పు ఎవరిది?…
కానీ అప్పటికే కొత్త బ్యాటర్‌ క్రీజులోకి రావడం బ్యాటింగ్‌ మొదలుపెట్టడం జరిగిపోయింది. అంతగా ఆసక్తి కలిగించదనుకున్న మ్యాచ్‌ కాస్తా ఈ అనూహ్య ఘటన మూలంగా.. క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.
సోషల్‌ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి ఈ ఘటనపై చర్చిస్తున్నారు నెటిజన్లు. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌లో క్రీడాస్ఫూర్తి కొరవడిందని చాలా మంది ట్రోల్‌ చేస్తుంటే.. ఇదంతా నిబంధనలకు అనుగుణమే కదా అని మరికొందరు వాదిస్తున్నారు…