యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ..దర్శనానికి 5 గంటలు…!!

యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. కార్తీక మాసం మొదటి ఆదివారం కావడంతో ఆలయ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్‌, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో స్వామివారి దర్శనానికి ధర్మ దర్శనానికి 5 గంటలు, రూ.150 దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. కొండకింద కల్యాణకట్ట వద్ద అధిక సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించి, లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

స్వామివారికి తెల్లవారుజామన సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన , స్వామివారికి నిజాభిషేకం, స్వామి, అమ్మవార్లకు ఉదయం శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులకు కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొండకింద వ్రత మండపంలో అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వారికి వ్రత మాచరించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు దీపారాధన పూజల్లో పాల్గొన్నారు.