నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం…

ఆధునిక కాలంలో అనంద నిలయుడికి అపురూప దేవాలయ నిర్మాణం. అద్భుత దివ్యధామం.. దేశంలో ఏ ఆలయానికీ తీసిపోని విధంగా..
అన్ని ఆలయాల శైలులను పుణికిపుచ్చుకొని.. తనదైన నిర్మాణరీతిలో అనన్యసామాన్యంగా యాదాద్రి నారసింహక్షేత్రం భక్తులకు కనువిందుచేయడానికి దాదాపుగా సిద్ధమైంది.


ఆధునిక కాలంలో సంపూర్ణంగా కృష్ణశిలతో రూపొందిన అరుదైన నిర్మాణమిది….
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది కృష్ణశిల. ఆలయ నిర్మాణానికి కృష్ణశిల శ్రేష్టమైంది. ఏండ్లు గడిచిన కొద్దీ ఈ శిల మరింత పదునుదేలుతుంది. దృఢమవుతుంది. మరింత నాణ్యంగా తయారవుతుంది. ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడం దీని ప్రత్యేకత. వేసవికాలంలో మరీ వేడిగా ఉండకుండా.. చలికాలంలో మరీ చల్లగా ఉండకుండా సమతుల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుంది. ఇప్పటివరకు దాదాపు 9.5 లక్షల క్యూబిక్‌ ఫీట్ల (2.5 లక్షల టన్నులు) కృష్ణశిలను వినియోగించారు. రాష్ట్ర మైనింగ్‌ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. కరీంనగర్‌, బ్రాహ్మణపల్లి, గురుజపల్లిల్లో మాత్రమే దేవాలయాలకు అనుకూలమైన కృష్ణశిల ఉన్నట్టు గుర్తించారు. ఇందులో నాణ్యమైన కృష్ణశిల ప్రకాశం జిల్లా గురుజపల్లిలో లభ్యమైంది. దీంతో అక్కడినుంచే ఆలయానికి కావాల్సిన మొత్తం కృష్ణశిలను సేకరించారు. ఒక దేవాలయ నిర్మాణానికి ఒకే క్వారీ నుంచి రాయిని తీసుకోవడం గతంలో ఎన్నడూ లేదని స్థపతులు చెప్తున్నారు. ఆలయంలో సాలహార విగ్రహాలను కూడా ఈ కృష్ణశిలతోనే చెక్కారు. రాతిని చెక్కినప్పుడు వాటి మొనల వల్ల ప్రమాదం కాకుండా ఉండేందుకు సున్నితంగా.. నునుపుదనంతో ఉండేలా చెక్కారు. యాదాద్రిలో విస్తృతంగా సంచరించే కోతులకు దెబ్బలు తగలకుండా, రాయి గుచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు..

.ఆలయ నిర్మాణానికి వాడే శిల అంటే వెయ్యేండ్లపాటు చెక్కుచెదరకుండా ఉండాలి. ఇందుకోసం అవసరమైన రాయి నాణ్యతను శాస్త్రీయంగా మదింపుచేశారు. ఎంపిక చేసిన క్వారీల్లోని రాళ్ల నాణ్యతను ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సిమెంట్‌, అండ్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ సంస్థ పరీక్షించింది. రాతితో చెక్కిన శిల్పాల నాణ్యతను మెస్సర్స్‌ సీవెల్‌ ఇంజినీర్స్‌ సంస్థ పరిశీలించింది. ఈ తరహా పరీక్షలను నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి…ఆధునిక నిర్మాణాల్లో రాళ్ల జాయింట్లను కలపడానికి సిమెంట్‌ వాడుతుంటారు. కానీ.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంట్‌ వాడలేదు. ప్రాచీన ఆలయ నిర్మాణాల్లో మాదిరిగా గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమాన్ని ఉపయోగించారు. బెంగళూరులోని బ్యూరో వెర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పరీక్షించి సర్టిఫై చేసింది. ఐఎస్‌ కోడ్‌లకు అనుగుణంగా వీటి పరీక్షలను నిర్వహించారు. పెద్ద జాయింట్ల వద్ద సీసాన్ని (లెడ్‌) కూడా వాడారు. దీనివల్ల జాయింట్ల జీవితకాలం గణనీయంగా పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.

యాదాద్రికి తోడుగా మరో ప్రాంతాన్ని టెంపుల్‌సిటీగా తీర్చిదిద్దుతున్నారు. 850 ఎకరాలను ఇప్పటికే దీని కోసం సిద్ధంచేశారు. సుమారు వెయ్యి వసతి గృహాలను అక్కడ నిర్మించనున్నారు. 252 కాటేజీలను తొలిదశలో ప్రారంభిస్తారు. ఒక్కొక్కదాన్ని కోటిన్నర విలువతో నిర్మిస్తున్నారు. వీటి డోనర్లు ఏడాదిలో 30 రోజులు ఇక్కడ ఉండవచ్చు. 13.5 ఎకరాల్లో ప్రత్యేకంగా వీఐపీల కోసం 15 కాటేజీలు నిర్మించారు. ఒక్కొక్కదానికి ఏడుకోట్లు వెచ్చించారు. గుట్ట కింద మరో 120 గదులు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఐదు నక్షత్రాల హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, పెండ్లి మండపాలు, దవాఖాన, పాఠశాల.. ఇలా అనేకవాటిని నిర్మించబోతున్నారు. వీటి పనులు కూడా జరుగుతున్నాయి. గుడిపైన విష్ణుపుష్కరిణి ఏర్పాటుచేశారు. ఇక కల్యాణకట్ట, నిత్యాన్నదాన సత్రం, 500 బస్సులు తిరిగేలా బస్‌ టర్మినల్‌ను కూడా నిర్మించారు. యాదాద్రి గుట్టకు చుట్టూ ఉన్న గ్రామాలన్నింటికీ ఆరులేన్ల రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం గుట్ట చుట్టూ 12 ఫీట్లతో రోడ్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. 40వేల మంది భక్తులు సులభంగా తిరిగేలా ఇత్తడితో క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ మఠాలవారికి ప్రత్యేకంగా స్థలాలను కేటాయిస్తున్నారు. ఉత్తరాదిపీఠం వారు ఇక్కడ వేదపాఠశాల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తంచేశారు..

541 దేవతారూపాలు
యాదాద్రి వైభవాన్ని వర్ణించడం అక్షరాల్లో సాధ్యమయ్యేపని కాదు. ఒక్కో గోపురంపై.. మండపంపై.. అద్భుత శిల్ప సంపద కన్నులపండువ చేస్తున్నది. దాదాపు 800 మంది శిల్పులు.. ఐదేండ్లు కష్టపడి ఈ దేవతామూర్తులు.. వివిధ పౌరాణిక గాథలకు సంబంధించిన శిల్పాలను సృష్టించారు.