యాదగిరిగుట్టలో కుండపోత వర్షం..

పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో కుండపోత వర్షం కురిసింది. ఆలయ పరిసరాల్లో కురిసిన వానకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పార్కింగ్ ప్లేస్ లో నిలిపిన కార్లన్నీ నీట మునిగాయి. పార్కింగ్ ప్లేస్ వర్షపు నీరుతో నిండిపోయింది. ఓ చిన్న సైజు చెరువును తలపించింది…అంతలా వర్షం దంచికొట్టింది అక్కడ. వాన పడితే చాలు యాదగిరిగుట్టపై నీరు నిలుస్తోంది. వాహనాలు నీట మునుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ సమస్యలు తప్పడం లేదు. గుట్టపై నీరు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని భక్తులు కోరుతున్నారు.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయం పునర్ నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన ప్రభుత్వం అనేక వసతులు కల్పించింది. రవాణ, వసతి సహా అనేక సౌకర్యాలు పెంచడంతో యాదాద్రికి భక్తుల సంఖ్య క్రమంగా భారీగా పెరిగింది. అయితే, వర్షం పడిన ప్రతీసారి గుట్టపై భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చిన్న పాటి వర్షానికే నీరు చేరుతోంది. వర్షపు నీరు బయటకు వెళ్లే దారి లేక, పార్కింగ్ ప్లేస్ చెరువులా మారిపోతోంది.