యూట్యూబ్ చూస్తూ కాన్పు చేసిన భర్త.. భార్య దుర్మరణం….!!

తమిళనాడు కృష్ణగిరి జిల్లా హనుమంతపురంలో ఘటన
సహజపద్ధతిలో ప్రసవం జరగాలనుకున్న భార్యాభర్తలు
యూట్యూబ్ వీడియోలు చూసి భార్యకు కాన్పు చేసిన భర్త
మగబిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికి మహిళకు తీవ్ర రక్తస్రావం
ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుల ప్రకటన

యూట్యూబ్ చూస్తూ భార్యకు కాన్పు చేయాలనుకున్న భర్త ప్రయత్నం చివరకు ఆమె ప్రాణాలమీదకే తెచ్చింది. ప్రసవం తరువాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. సహజసిద్ధంగా ప్రసవం జరగాలన్న ఆ భార్యభర్తల కోరిక చివరకు విషాదం మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురానికి చెందిన మాదేశ్‌కు(27) పొచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేసిన వారిద్దరూ తమ ఇంటి పెరట్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరలనే తినేవారు.

ఇటీవల లోకనాయకి గర్భం దాల్చింది. దీంతో, వారు ప్రసవం కూడా సహజపద్ధతిలో జరగాలని నిర్ణయించుకున్నారు. అది మొదలు మాదేశ్ యూట్యూబ్‌‌లో వీడియోలూ చూస్తు ప్రసవం ఎలా చేయాలనే విషయంపై అవగాహన పెంచుకునేవాడు. మంగళవారం లోకనాయకికి నొప్పులు మొదలవడంతో మాదేశ్ తన యూట్యూబ్ జ్ఞానంతో ఆమెకు ప్రసవం చేశాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లోకనాయకికి ఆ తరువాత తీవ్ర రక్తస్రావమైంది. దీంతో, కంగారు పడిపోయిన మాదేశ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.