తుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికే చంద్రబాబు పొత్తులు, జిత్తులు – సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.

Andhra Pradesh News CM YS Jagan: మేదరమెట్ల: ఏపీలో జరగబోతున్న సంగ్రామంలో పేదవాడికి అండగా నిలిచేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగన్ ను ఓడించేందుకు కూటమి, జగన్‌ను గెలిపించేందుకు మీరు చేస్తున్న పోరాటంలో అంతిమ విజయం తమదేనన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ఆదివారం నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభలో పొల్గొన్న సీఎం జగన్.. ఎన్నికల కోసం బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పెట్టుకుంటున్న పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలతో పొత్తుగా ఎన్నికలకు వెళ్తుంటే, చంద్రబాబు మాత్రం వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను సింహం అని, సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు…జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని బయటకు తీసి, మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిపై ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు వెంట ఉన్నట్లు నటించే పొలిటికల్ స్టార్లు తన వద్ద లేరంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఒంటరిగానే ఎన్నికలు వెళ్తున్న తనకు ఉన్నది కేవలం ప్రజా మద్దతు అని, వారే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ పేర్కొన్నారు. జనసేనతో పాటు చంద్రబాబు జేబులో మరో రాజకీయ పార్టీ ఉందని.. ఏపీలో ఇటీవల ఏర్పాటైన మూడు పార్టీల పొత్తుపై సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలలో సైన్యాధిపతులు తప్పా, సైన్యమే లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలు, ప్రజల చేతిలో చిత్తుగా ఓడిన పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్‌ను ఓడించేందుకు వస్తున్నాయని చెప్పారు.