ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ

వైయస్ రాజశేఖర్ రెడ్డి గతంలో పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు కాలే రవికాంత్ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లో కలిసారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు అలాగే తాజా పరిణామాల మీద ఎమ్మెల్యే కుమారుడితో షర్మిల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాలే యాదయ్య కూడా ఎన్నోసార్లు తాను వైయస్ అభిమానిని అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి తాను నేరుగా వెళ్లి కలిస్తే ఇబ్బంది అవుతుందని భావించి కొడుకును పంపారా ? లేక వైఎస్ అభిమానుల లాగా ఆహ్వానం అందింది కాబట్టి కాదనలేక వెళ్లి కలిసి వచ్చారా అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఎంపీపీగా మొదలుపెట్టి జెడ్పీటీసీగా గెలిచిన కాలే యాదయ్య తాను వైఎస్ అభిమానిని గతంలో చాలా సార్లు చెప్పుకున్నారు. దానికి కారణం వైయస్ పట్టుబట్టి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు చేవెళ్ల నియోజకవర్గం టికెట్ ఇప్పించడమే. మొదటి సారి ఓడిపోయినా సరే ఆయన 2014, 2018 రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన టి.ఆర్.ఎస్.లో చేరి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు.