సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం..గీత కార్మికులు ప్రమాదానికి గురైతే రూ.10 లక్షల బీమా భరోసా..

అమరావతి గీతకార్మికుల సంక్షేమం కోసం సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వృత్తి రీత్యా పనులు చేస్తున్న క్రమంలో గీత కార్మికులు ప్రమాదానికి గురైతే ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ గీత కార్మిక భరోసా పేరుతో పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల బీమా భరోసా కల్పించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గుర్తైతే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనుంది. మొత్తం రూ.10 లక్షల పరిహారంలో రూ.5 కార్మిక శాఖ ద్వారా, మరో రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌ గ్రేషియా కింద చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు…నూతన విధానాలతో కూడిన ‘వైయస్‌ఆర్‌ గీత కార్మిక భరోసా’ పథకానికి సీఎం జగన్‌ శుక్రవారం నాడు ఆమోదం తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించే కార్మికులతో పాటు చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యానికి గురయ్యే కార్మికులకు కూడా పరిహారం అందజేయాలని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ అంగవైకల్యం బారిన పడే కార్మికులకు ఎక్సైజ్‌ శాఖ వైకల్యం సర్టిఫికెట్‌ను జారీచేయనుంది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ గురువారం నాడే ఉత్తర్వులు జారీచేసింది.