జిమ్ చేస్తుండగా 23 ఏళ్ల యువకుడికి సడన్ హార్ట్ ఎటాక్…

ఈ మధ్య సడెన్ హార్ట్ అటాక్‌లు.. వయసుతో పనిలేకుండా వచ్చేస్తున్నాయి. ఎవరి జీవితం ఎప్పుడు ముగుస్తుందో అర్థంకాని పరిస్థితి. అప్పటి వరకు మనతోనే ఉంటారు.. అంతలోనే అందర్నీ వదిలేసి వెళ్లిపోతున్నారు.. ఆరోగ్యం కోసమో లేక ఫిట్ నెస్ కోసమో జిమ్ చేసే వారి సంఖ్య ఎక్కువైంది. కానీ అదే కొందరి పాలిట శాపంగా మారుతోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తూనే నేలకొరుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో మరో యువకుడు కూడా ఇలానే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా రామయ్యబౌలికి చెందిన మాజిద్ హుస్సేన్ షోయబ్ అలియాస్ జున్ను (23) స్థానికంగా చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజూ సాయింత్రం పూట జిమ్‌కు వెళ్లేవాడు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి కూడా న్యూటౌన్ ప్రాంతంలో ఉన్న జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేశాడు. రాత్రి 8గంటలకు ఇంటికి వచ్చాడు. 11 గంటల సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. ఆపై వాంతులు చేసుకున్నాడు. అనంతరం గుండెలో ఏదో ఇబ్బందిగా ఉందని ఇంటి ముందు కొద్ది సేపు వాకింగ్ కూడా చేశాడు. కానీ కాసేపటికే కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యలు మాజిద్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు.