బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ కాల్పులు..

Firing.. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ముంబైలోని రద్దీ ప్రాంతమైన జుహులో దుండగులు కాల్పులకు తెగబడటం బాలీవుడ్‌ ప్రముఖుల్లో భయాన్ని పుట్టించింది. ఈ అటాక్ నుంచి అదృష్టవశాత్తూ టైగర్ ష్రాఫ్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఆయన కారు డ్రైవర్, మరో వ్యక్తి గాయపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో బెదిరింపు పోస్ట్‌.

ఈ కాల్పుల ఘటనకు పాల్పడింది తామేనంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పబడుతున్న వ్యక్తుల పేరుతో సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వెలుగులోకి వచ్చింది. అనిల్‌ పండిట్‌, అనిల్‌ హర్మన్‌ సంధు ఈ దాడి వెనుక ఉన్నారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. మేము అతడికి ఫోన్‌ చేసి విషయం వివరించడానికి ప్రయత్నించాం. కానీ అతడు అర్థం చేసుకోలేదు. అందుకే ఈరోజు అతడికి సరైన రీతిలో వివరించాం” అనే అర్థం వచ్చేలా ఆ పోస్ట్‌లో వ్యాఖ్యలు ఉన్నాయి. ముంబై చిత్ర పరిశ్రమలో తమ మాట వినని వారు లేదా సల్మాన్‌ ఖాన్‌తో కలిసి పనిచేసే వారు తదుపరి లక్ష్యమవుతారని ఆ పోస్ట్‌లో బెదిరించినట్లు సమాచారం. ఈ బెదిరింపు నేపథ్యంలో బాలీవుడ్‌ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, కాల్పులకు గల కారణాలు, దాడి వెనుక ఉన్న వ్యక్తుల వివరాలపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని అంశాలు వెల్లడికావాల్సి ఉంది..

సల్మాన్ ఖాన్‌తో సాన్నిహిత్యమే కారణం..!.

ఈ కాల్పుల ఘటన వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు తేలింది. టైగర్ ష్రాఫ్‌పై అటాక్‌కు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్, హర్మాన్ సంధూ అనే వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా, ఆడియో క్లిప్‌ల ద్వారా ప్రకటించారు. ‘మేము టైగర్ ష్రాఫ్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆయన వినలేదు, అందుకే ఇవాళ తగిన పాఠం నేర్పించాం’ అని ఆ ఆడియోలో పేర్కొన్నారు. మొత్తం సినీ పరిశ్రమలో తమ మాట వినని వారు, నటుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే ఎవరినైనా వదిలిపెట్టబోమని, ఇదే తమ చివరి హెచ్చరిక అని వారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బాబా సిద్దిఖ్ హత్యలాగే ప్లాన్…

అయితే, గతంలో ఎన్సీపీ నేత బాబా సిద్దిఖ్ హత్య కూడా సల్మాన్ ఖాన్‌తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో జరిగిందని పోలీసులు గుర్తుచేశారు. సరిగ్గా అదే పద్ధతిలో ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌ను కూడా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజా కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దోషులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూ, దాడికి పాల్పడిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు..

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి
“బాలీవుడ్‌లో మా హెచ్చరికలను నిర్లక్ష్యం చేసేవారైనా, సల్మాన్ ఖాన్‌తో కలసి పనిచేసేవారైనా తర్వాతి లక్ష్యం మీరే. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడండి” అని బిష్ణోయ్ గ్యాంగ్ బహిరంగంగానే బెదిరింపులకు దిగింది. తమ పేరు వాడుకుని పబ్లిసిటీ పొందేందుకు చూసే ఇతర ముఠాల కథ కూడా ముగిస్తామని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.