450కి పైగా బాలిస్టిక్ క్షిపణులు, యూఏవీలను ప్రయోగించిందన్న ఇజ్రాయెల్

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. అయితే తమ దేశాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ఇరాన్ దాడులు చేస్తుందని ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. గత ఆరు రోజుల్లో బీర్షెవాలో ఆస్పత్రిపై దాడి చేయడమే కాకుండా, 450కి పైగా బాలిస్టిక్ క్షిపణులతోపాటు వందలాది యూఏవీలను ప్రయోగించిందని డెఫ్రిన్ తెలిపారు.

ఆశ్చర్యం కలగించలేదు!..

“గురువారం తెల్లవారుజామున ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి బీర్షెవాలోని సోరోకా ఆస్పత్రిని నేరుగా తాకింది. ఆ ఆస్పత్రి బెడౌయిన్లు, యూదులు, క్రైస్తవులు, అరబ్లు సహా పది లక్షలకు పైగా ఇజ్రాయెలీయులకు సేవలు అందిస్తుంది” అని ఆయన తెలిపారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో పౌర కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనే తమ కోరికను బహిరంగంగా ప్రకటిస్తున్నారని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలను సిద్ధం చేయడానికి ఎందుకు అనుమతించకూడదో ఈ కారణాలు సమర్థిస్తున్నాయని డెఫ్రిన్ అన్నారు.

ఇరాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంది!
ఇరాన్ అణ్వాయుధాలను పొందేందుకు లేదా దాని క్షిపణి కార్మాగారాన్ని విస్తరించేందుకు తాము అనుమతించలేమని, అనుమతించమని చెప్పారు. అందుకే తమ పని తాము చేస్తామని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధ స్థావరాలు, సైనిక ప్రదేశాలపై దాడి చేస్తామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అస్తిత్వ ముప్పును లక్ష్యంగా చేసుకుంటుండగా, ఇరాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుందని డెఫ్రిన్ అన్నారు. ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే అస్తిత్వ ముప్పును లక్ష్యంగా చేసుకున్నామని, తాము విజయం సాధిస్తామని చెప్పారు…

బాలిస్టిక్ క్షిపణితో దాడి!.

ఇజ్రాయెల్ తన ప్రజలను రక్షించడానికి అవసరమైనవన్నీ చేస్తుందని భారత్లోని ఆ దేశ రాయబార కార్యాలయం తాజాగా వెల్లడించింది. “ఇరాన్ బీర్షెబాలోని సోరోకా ఆసుపత్రిపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. అది ప్రధాన వైద్య కేంద్రం. మేం నిశ్శబ్దంగా కూర్చోం. మన ప్రజలను రక్షించడానికి అవసరమైన ప్రతిదాన్ని చేస్తూనే ఉంటాం” అని చెప్పింది. దాదాపు 20 ఐఎంఎఫ్ యుద్ధ విమానాలు ఇరాన్ చేసిన దాడుల్లో పాల్గొన్నాయని పేర్కొంది..