Maharashtra .. పూజ చేసుకునేందుకు వచ్చిన బాలికపై అసభ్యకర ప్రవర్తన.

శివాలయంలోకి వెళ్లి శివలింగానికి పూజలు నిర్వహిస్తున్న ఓ పదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన రేకెత్తించింది. దేవుడిని ప్రార్థించేందుకు వెళ్లిన బాలికకు ఆలయంలోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/balmukundjoshi/status/2109693099677217261?s=20

మహారాష్ట్ర పుణెలోని నిగ్డీ ప్రాంతంలో ఉన్న శివాలయంలో దారుణ ఘటన జరిగింది. శివాలయానికి బాలిక ఒంటరిగా వెళ్లింది. అక్కడి శివలింగానికి మోకాళ్లపై కూర్చొని పూజలు చేసింది. ఈ సమయంలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆలయంలో బాలిక ఉండటాన్ని గమనించి లోపలికి వచ్చాడు. చిన్నారి వద్దకు వెళ్లి బలవంతంగా ఆమెను తాకేందుకు ప్రయత్నం చేశాడు. బాలిక వారించినప్పటికీ వినకుండా ఆమెను అసభ్యకరంగా తాకాడు. దీంతో బాలిక బయపడి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దేవాలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

నిందితుడు వెళ్లిపోయిన తరువాత బాలిక మరోసారి శివలింగానికి దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. గుడిలో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో.. వారు నిగ్డీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గుడిలో సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా.. బాలిక పట్ల నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు గుర్తించారు.

సీసీటీవీ పుటేజీలో దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు చెందిన విశాల్ సింగ్‌గా గుర్తించారు. అతను మెట్రో కాంట్రాక్టర్ వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.