ఏపీలో ఉద్రిక్త పరిస్థితులపై ఎస్ఈసీ ఆగ్రహం..

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. స్థానిక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తిన సందర్భాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీలు), పోలీసు కమిషనర్లను తక్షణమే అప్రమత్తం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు..

నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల నిఘా

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు సమయంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు అనుమతించిన ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధన అమలులో ఎలాంటి ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకూడదని అధికారులకు సూచించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు.

నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో కలిపి ముగ్గురికి మాత్రమే అనుమతి

‘రాష్ట్రంలో శాంతిభద్రతలపై రాజకీయపార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి కలెక్టర్లకు సమాచారం ఇచ్చాం. వెంటనే పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాం. హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్రచర్యలు ఉంటాయి. హింసాత్మక ఘటనలు జరిగితే అదనపు బలగాలు ఏర్పాటు చేస్తాం. నామినేషన్ సెంటర్లలో అదనపు భద్రత కల్పిస్తాం’అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.‘ప్రతి నామినేషన్ సెంటర్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో కలిపి ముగ్గురికి మాత్రమే అనుమతి. నామినేషన్ల వేళ అధికారుల నిర్లక్ష్యం ఉంటే బదిలీ, సస్పెండ్ చేస్తాం. అధికారుల నిర్లక్ష్యం ఉంటే క్రమశిక్షణా చర్యలు ఉంటాయి’ అని అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు.