కడప నగరంలో తీవ్ర ఉద్రిక్తత..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి నివాసంపై అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి,…

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి నివాసంపై సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చిన నిందితులు ఆమె ఇంటిపైకి మద్యం సీసాలను విచక్షణారహితంగా విసిరారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో పగిలిన మద్యం సీసాలతో పాటు ఒక వేటకొడవలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడి వెనుక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర దాగి ఉందని బండి దీప్తి ఆరోపించారు. ఎన్నికల బరిలో ఉన్న తనను భయభ్రాంతులకు గురిచేసి, పోటీ నుంచి తప్పించాలనే దుర్బుద్ధితోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి వచ్చిన వారు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను వినియోగించినట్లు ఆమె వెల్లడించారు.

సమాచారం అందిన వెంటనే కడప వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సున్నిత ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేశామని పోలీసులు స్పష్టం చేశారు.