వాతావరణ మార్పు.. కోట్లాది మంది మనుషుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో…!

ఎల్‌నినోతో ఎండలు, వరదలు, కరువు ముప్పు.

గర్భిణులు, తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం

ఈ పరిణామాలతో పేద దేశాల ప్రజలకే నష్టం.

వాతావరణ మార్పులు 21వ శతాబ్దంలో మానవ ఆరోగ్యానికి అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారుతున్నాయి. ఒకచోట తీవ్రమైన ఎండలు, మరో చోట కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు.. ఇంకొన్ని ప్రాంతాల్లో కరువు కరాళ నృత్యం.. ఇలా ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ప్రజారోగ్య వ్యవస్థలపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశాల నేపథ్యంలో దక్షిణార్ధ గోళంలో తీవ్ర ఉష్ణ తరంగాలు, కరువు, వరదలు సంభవించే ప్రమాదం పొంచి ఉందని ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమైన అధ్యయన ఆధారిత లేఖ ఆందోళన వ్యక్తం చేసింది…

వాతావరణ మార్పు.. కోట్లాది మంది మనుషుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టగలదా? సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల దోమల వ్యాప్తి నుంచి ప్రాణాంతకమైన వడదెబ్బ వరకు ఎన్నో సమస్యలు తీవ్రమవుతాయా?..అవును. దీనికి కారణం ఎల్‌నినో!

భూమి వాతావరణ వ్యవస్థలో జరిగే సహజమైన మార్పుల్లో ఎల్‌నినో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మార్పు ఒక్క సముద్రానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిస్తుంది…ఇప్పుడు ఈ ఎల్‌నినో ప్రభావం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భూతాపంతో వేడెక్కుతున్న భూమిపై ఎల్‌నినో మరో ఉష్ణ ప్రభావాన్ని తీసుకురావచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది….2027 ప్రారంభం వరకు దీని ప్రభావం కొనసాగవచ్చని అంచనా వేస్తోంది. ఈ పరిణామాల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా ఎల్‌నినోతో ముడిపడిన ఆరోగ్య ప్రభావాలను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించింది. ఇందులో మొదటిది తీవ్రమైన వేడి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే వడదెబ్బ, డీహైడ్రేషన్, గుండెపై ఒత్తిడి లాంటి సమస్యలు పెరుగుతాయి. రెండోది గాలి నాణ్యత. కరువులు, అడవుల్లో మంటల కారణంగా పొగ, కాలుష్య కారకాలు గాలిలోకి చేరి శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. మరోవైపు వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు దోమల వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించవచ్చు. ఫలితంగా డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల ముప్పు మారుతుంది. కలుషితమైన నీటి సమస్యలు పెరిగితే కలరా లాంటి వ్యాధుల ప్రమాదం కూడా ఉంటుంది. పంటలు దెబ్బతినడం, నీటి కొరత ఏర్పడటం వల్ల ఆహార భద్రత దెబ్బతిని పోషకాహార లోపం పెరిగే అవకాశం ఉంది.