అగ్రికల్చర్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

అగ్రికల్చర్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

భారత్‌పై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం
సంక్షోభం వల్ల డీజిల్ ధర రూ.50 పెంచాల్సింది
ప్రభుత్వం రూ.7 మాత్రమే పెంచింది..

దేశంలో ప్రతి రంగానికి సౌరవిద్యుత్ అందిస్తాం-మోదీ
వ్యవసాయ ఎగుమతులు రూ.4 లక్షల కోట్లకు పెరిగాయి
రైతుల ఆదాయం పెరిగింది..

దేశంలో తేనె ఉత్పత్తి రెట్టింపు అయ్యింది-మోదీ..

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘భారత్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ 2026’ (కిసాన్ తక్ సదస్సు) లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించకుండా, రైతులను శక్తివంతం చేయకుండా ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు..

సంక్షోభం వల్ల డీజిల్ ధర రూ.50 పెంచాల్సింది. ప్రభుత్వం రూ.7 మాత్రమే పెంచింది. దేశంలో ప్రతి రంగానికి సౌరవిద్యుత్ అందిస్తాం. వ్యవసాయ ఎగుమతులు రూ.4 లక్షల కోట్లకు పెరిగాయి. రైతుల ఆదాయం పెరిగింది. దేశంలో తేనె ఉత్పత్తి రెట్టింపు అయ్యింది’ అని అన్నారు..

ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన ‘కిసాన్ తక్ భారత్ వ్యవసాయ సదస్సు’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రైతులకు సాధికారత కల్పించకుండా అభివృద్ధి చెందిన భారతదేశ దార్శనికతను సాకారం చేసుకోలేమని, భారత వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారిత పరివర్తన తీసుకురావాలని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాలను పెంచడంలో పంటల వైవిధ్యం, సౌరశక్తి, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటి పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ, రసాయనాల వాడకాన్ని తగ్గించి, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని రైతులకు పిలుపునిచ్చారు…
వ్యవసాయ రంగం దేశ ప్రగతికి, సంస్కృతికి, సామాజిక జీవితానికి కేంద్ర బిందువు అని ఆయన అభివర్ణించారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పండుగ సీజన్‌ను, ముఖ్యంగా ఛత్ పండుగను, భారతదేశ వ్యవసాయ సంప్రదాయాలతో ముడిపెట్టారు. వ్యవసాయం దేశ జీవన విధానంతో ముడిపడి ఉందని అన్నారు. గురువారం నిర్వహించిన భారత్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్లో మోదీ ఈ మేరకు ప్రసంగించారు..ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసిన మోదీ, వికసిత్ భారత్ నిర్మాణానికి గుర్తించిన ఏడు ప్రధాన బలాల్లో వ్యవసాయం కూడా ఒకటని అన్నారు. గత దశాబ్దంలో భారతదేశ వ్యవసాయ వృద్ధి రేటు నాలుగు శాతానికి పైగా ఉందని, స్వాతంత్ర్యం తర్వాత దేశం ఇంతటి వృద్ధిని సాధించిన మొదటి దశాబ్దం ఇదేనని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా, పేదరికంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన తగ్గుదల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ, భారత్లో 50 కోట్ల మంది ప్రజలు కేవలం 12-13 ఏళ్లలోనే పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆ అధ్యయనం పేర్కొందని చెప్పారు…

ఏటా రూ. 4 లక్షల కోట్లకు పైగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి
భారత్ నుంచి జరుగుతున్న వ్యవసాయ ఎగుమతుల గురించి ప్రస్తావిస్తూ, ప్రతి ఏటా రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. ఫలితంగా రైతుల ఆదాయం పెరుగుతోందని చెప్పారు. పాలు, పప్పుధాన్యాలు, జనపనార (జూట్), బియ్యం, చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు.

“గోధుమలు, పత్తి, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలోనే ఉంది. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారతదేశం, చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా నిలిచింది. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కావు. ఇవి భారతీయ రైతుల అపార సామర్థ్యాన్ని తెలియజేస్తాయి.” అన్నారు…గత దశాబ్ద కాలంలో పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, మత్స్య రంగం, తేనెటీగల పెంపకం, ఉద్యానవన రంగం వంటి అనుబంధ వ్యవసాయ రంగాల్లో సాధించిన వృద్ధిని కూడా ప్రధాని మోదీ వివరించారు. “గత పదేళ్లలో భారతదేశంలో పాల ఉత్పత్తి దాదాపు 70 శాతం పెరిగింది. గుడ్ల ఉత్పత్తి 90 శాతం వృద్ధి చెందింది. అలాగే, మత్స్య ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ‘స్వీట్ రివల్యూషన్’ తేనెటీగల పెంపకంలో కొత్త అవకాశాలను కల్పించింది. తేనె ఉత్పత్తి 80,000 టన్నుల నుంచి 1,50,000 టన్నులకు పెరిగింది” అని మోదీ పేర్కొన్నారు.

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడి చమురు ధరల గురించి మోదీ గుర్తు చేసుకున్నారు. “పశ్చిమాసియాలో యుద్ధ ముప్పు పొంచి ఉన్నప్పుడు, ముడి చమురు ధరలు కొన్ని వారాల వ్యవధిలోనే బారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు పెరిగాయి. అప్పట్లో భారత్ ఒక పెద్ద సవాలును ఎదుర్కొంది. డీజిల్ ధరను లీటరుకు కనీసం రూ.50 మేర పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో, ప్రభుత్వం మన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకుంది. రూ.50 పెంపునకు బదులుగా, ప్రభుత్వం డీజిల్ ధరను లీటరుకు కేవలం 7 రూపాయలు మాత్రమే పెంచి, మిగిలిన 43 రూపాయల భారాన్ని భరించింది. మన పొరుగు దేశాల్లో చాలా చోట్ల డీజిల్ ధరలు 40 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయి. కానీ భారత్‌లో అలా జరగలేదు. అప్పటి నుండి, ప్రభుత్వం ప్రతి నెలా రూ.14,000 కోట్ల నష్టాన్ని భరిస్తూ వస్తోంది” అని మోదీ తెలిపారు…