రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!

ఢిల్లీ

రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!

పెంచిన సీట్ల సంఖ్య 25 ఏళ్లపాటు (2051 వరకు) కొనసాగించే సవరణలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా.

మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం.

పార్లమెంటులో వచ్చే వారం డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్యను ఏకరీతిగా 50 శాతం పెంచే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల ప్రధాన డిమాండ్‌కు అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 850కి చేరనున్న లోక్‌సభ బలం: కొత్త ప్రతిపాదన ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ సీట్లు 50 శాతం పెరుగుతాయి. దీనితో లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 850కి చేరుకుంటుంది.

సీట్ల వాటా తగ్గిపోతుందేమోనని దక్షిణాది రాష్ట్రాలు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని సీట్ల సంఖ్యను సమాన నిష్పత్తిలో 50 శాతం పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ ఆందోళనలకు చెక్ పెట్టినట్లయింది. ఈ అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్‌లో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ ఏర్పాటు 2051 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది..

పునర్విభజన ప్రక్రియ తర్వాత లోక్‌సభలో మొత్తం సీట్ల సంఖ్య 850కి చేరే అవకాశం ఉంది. పునర్విభజన బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్‌ను కూడా అనుసంధానించడం వల్ల 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం ఖాయం కానుంది. అంచనాల ప్రకారం ప్రధాన రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఇలా ఉండబోతుంది.. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 80 లోక్‌‌సభ సీట్లు ఉండగా.. అది 120కి పెరగనుంది. ఇక ఏపీలో ప్రస్తుతం 25 సీట్లు ఉండగా..అవి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు, మహారాష్ట్ర 48 ఉండగా 72కు, పశ్చిమ బెంగాల్ 42 నుంచి| 63కు, బిహార్ 40 నుంచి 60కి, తమిళనాడు 39 నుంచి సుమారు 59కి సీట్లు పెరుగుతాయి…

2051 వరకు యథాతథ స్థితి: తాజా సవరణల ప్రకారం, రాబోయే 25 ఏళ్ల పాటు అంటే 2051 వరకు ఈ సీట్ల కేటాయింపులో ఎలాంటి మార్పు ఉండదు (ఫ్రీజ్). జనగణనతో సంబంధం లేకుండా..: అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచడం ద్వారా, డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా లెక్కల (సెన్సస్) నుండి కేంద్రం వేరు చేసింది. మహిళా రిజర్వేషన్లకు లింక్: పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడి ఉన్న ఈ సవరించిన డీలిమిటేషన్ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం వర్షాకాల సమావేశాల పొడిగింపుగా నవంబర్ 30న కేంద్రం ప్రత్యేక సమావేశాన్ని (మినీ-సిట్టింగ్) ఏర్పాటు చేసింది.

శనివారం ఇండియా కూటమి కీలక భేటీ.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి శనివారం ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించే విషయంలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏయే పార్టీలు హాజరవుతాయి, ముఖ్యంగా శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ప్రతినిధులు వస్తారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Union Cabinet delimitation approval