అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్…హోరాహోరీ పోరు తప్పదా..!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. అమెరికాలోని దాదాపు 25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు..ఇప్పటికే దాదాపు
8 కోట్ల మంది తమ ఓటు వినియోగించు కున్నారు. ఇక, చివరి నిమిషం వరకు స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ట్రంప్, కమలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే సంస్థలు గెలుపు పన తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి.

రేపే పోలింగ్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కు సర్వం సిద్దమైంది. అధ్యక్ష పీఠం కోసం డొనాల్డ్ ట్రంప్‌, కమల హ్యారిస్ పోటీలో ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు నెలల కాలంగా ఇద్దరు నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ రోజుతో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే ఈ ఇద్దరిలో గెలుపు అవకాశాల పైన పలు సర్వే సంస్థలు తమ అంచనాలు వెల్లడించాయి. ఈ నివేదికలను పరిశీలిస్తే ఇరువురి మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా స్వింగ్ స్టేట్స్ కీలకం కానున్నాయి. అక్కడా ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగానే పోటీ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

సర్వే సంస్థల అంచనాలు

ది న్యూయార్క్ టైమ్స్‌-సైనా ఒపీనియన్ పోల్స్ అక్టోబర్ 24 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించారు. అందులో విస్కాన్సిన్‌, నార్త్ కరోలినా, నెవెడాలో కమలకు మద్దతు ఉన్నట్లుగా తేల్చారు. అదే వింగా అరిజోనాలో ట్రంప్‌వైపు ఓట్లరు మొగ్గచూపుతున్నట్లు సర్వే లెక్కలు స్పష్ట చేస్తున్నాయి. కాగా, ఆసక్తి కరంగా అలాగే పెన్సిల్వేయా, జార్జియా, మిషిగన్‌లో ఇరువురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ నుంచి ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్ధి కమల మధ్య ఉన్నప్పటికీ.. మరి కొంత మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌, కార్నెల్ వేస్ట్‌లు ఇండిపెండెంట్స్‌గా బరిలో ఉంటే.. లిబర్టేరియన్ పార్టీ నుంచి చేజ్ ఓలివర్, గ్రీన్‌పార్టీ నుంచి జిల్ స్టీన్ పోటీలో ఉన్నారు.

స్వింగ్ రాష్ట్రాల్లో

ప్రచారంలో ట్రంప్, కమల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. పలు అంశాల పైన ఒకరిని మరొకరు టార్గెట్ చేస్తున్నారు. ఎలక్టొరల్‌ కాలేజీలో అత్యధిక ఎలక్టొర్స్‌ కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో తాజా ర్యాలీలో ట్రంప్ చేసిన చేసిన కామెంట్స్ కమలాకు వరంగా మారాయి. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్యూర్టోరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. దీనిని సొమ్ము చేసుకోవడానికి హారిస్‌ యత్నిస్తున్నారు. తాజాగా బయటకు వచ్చిన మరో ఒపీనియన్‌ పోల్‌లో హారిస్‌కు అమెరికన్ల మద్దతు 44 శాతం నుండి 43 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. దీంతో ఈ సారి ఎన్నికల ఫలితాన్ని జార్జియా, మిచిగాన్‌ వంటి ఏడు స్వింగ్‌ రాష్ట్రాల పైనే ఆధారపడినట్లు స్పష్టం అవుతోంది. ఇక, ప్రవాస భారతీయుల ఓటింగ్ సైతం కీలకంగా మారుతోంది. దీంతో, రేపు జరిగే పోలింగ్ పైన ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది..