నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 02 – 12 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,

తిథి : పాడ్యమి ఉ11.58 వరకు,
నక్షత్రం : జ్యేష్ఠ మ3.50 వరకు,
యోగం : ధృతి సా4.49 వరకు,
కరణం : బవ ఉ11.58 వరకు,
తదుపరి బాలువ రా12.11 వరకు,

వర్జ్యం : రా12.08 – 1.47,
దుర్ముహూర్తము : మ12.10 – 12.54,
మరల మ2.23 – 3.07,
అమృతకాలం : ఉ6.31 – 8.12,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండం : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.17,
సూర్యాస్తమయం: 5.20,

*_నేటి విశేషం_*

*పోలి పాడ్యమి*
“అసూయ, హింసా ప్రవృత్తి భగవంతుడు మెచ్చడు. ఆయనకు కావలసింది నిశ్చలమైన, పరిపూర్ణమైన భక్తిమాత్రమే.
ఉన్నంతలో యధాశక్తిగా ఆరాధించిన వారిని భగవంతుడు ఎప్పుడూ సంరక్షించి అక్కున చేర్చుకుంటాడు.

ఈ నీతిని తెలిపే కథ ‘పోలి స్వర్గదీపం’. కార్తిక స్నానం, దీపారాధన వ్రతదీక్షగా చేసిన మగువలు మార్గశిర శుద్ధ పాడ్యమినాడు ఉద్యాపన చేసుకుంటారు.
తెల్లవారు జామునే నదీస్నానం చేస్తారు.
అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెడతారు.

తెలుగునాట ఈ పర్వాన్ని విస్తృతంగా జరుపుకుంటారు, ముఖ్యంగా కృష్ణానదీ తీర క్షేత్రాలైన విజయవాడ వంటిచోట్ల మార్గశిర శుద్ధ పాడ్యమికి విశేష సంఖ్యలో మహిళా మణులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

*🙏🪔పొలమ్మ భక్తికి మెచ్చిన స్వర్గం నుండి వచ్చిన దేవతలు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్ళే వృత్తాంతమే పోలిస్వర్గం నోము కధ.*

*🙏🪔పోలి స్వర్గం నోము కధ🪔🙏*

🙏🪔ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది … చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం … పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు.

🙏🪔 కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి … పూజలు చేయడానికి … అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా వుంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది.

🙏🪔పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున వుంచి , మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి , ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్లింది. పోలి ఏ మాత్రం బాధపడకుండా , బావి దగ్గరే స్నానం చేసి … పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది.

🙏🪔పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త , తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది.

🙏🪔ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది.

ఇంటికి చేరుకున్న తరువాత పోలి స్వర్గం కథను చెప్పుకుని అక్షతలు తలమీద వేసుకుంటారు.
అప్పటి నుంచి మార్గశిర పాడ్యమి రోజు దీపాలను నదిలో వదిలి…
ఈ కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

కథ లోపమైనను వ్రత లోపం ఉండరాదు.
పద్ధతి తప్పిననూ ఫలము తప్పదు, దీనికి ఉద్యాపనము లేదు.
తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు…
అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.

ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట.
ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది.
భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది.
అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది.
అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది.

అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ…పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

ఇంతటితో కథ సమాప్తం, పోలిస్వర్గం శుభ ఫలితాలు అందరూ పొందాలని ఆశిస్తూ నమస్సుమాంజలి.

*_☘️శుభమస్తు☘️_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏