నేటి కథ..ఎవరు దాత?….

నేటి కథ..ఎవరు దాత?…

రచన : సుదర్శన్‌, పీలేరు, చిత్తూరు జిల్లా.

*ఓక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ధనిక రైతులు ఇద్దరు వుండే వాళ్ళు. ఇద్దరూ మంచి వాళ్ళు; తమకు చేతనైనంత వరకూ ఇతరులకు సాయం చేసేవాళ్ళు. అందరూ వాళ్ల దాతృత్వం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు.*

*ప్రతి సంవత్సరమూ పంట కోతలకు ముందు, గ్రామదేవతలకు ప్రీతిగా అక్కడ ఒక జాతర జరుగుతుంది. ప్రతిసారి లాగానే ఈసారి కూడ రామయ్య, సోమయ్య ఇద్దరూ జాతరకోసం భూరి విరాళం ఇచ్చారు. ఆ సమయంలో గ్రామ దేవతలకు వీళ్లిద్దరిలో నిజంగా ఎవరు గొప్పవాళ్ళో కనుక్కోవాలని ఒక కోరిక కలిగింది. ఆ సమయానికి కోతలు అయ్యి రామయ్య, సోమయ్య పంటలు చేనులో ఉన్నాయి. వీళ్లని పరీక్షిద్దామనుకున్న గ్రామదేవతలు ఆ పంట మొత్తాన్నీ మాయం చేసేసారు.*

*చేతికి అంది వచ్చిన పంటని ‘దొంగలు ఎత్తుకెళ్ళారు’ అనుకున్నారు ఇద్దరూ. ‘ఇలా జరిగిందేమి?’ అని నిండా విచారంలో మునిగి ఉన్నాడు సోమయ్య. అతను ఇంకా ఆ బాధలో ఉండగానే పొరుగూరు నుండి రైతులు కొందరు వచ్చారు. “అయ్యా! ప్రతి ఏడాదీ తమరు ఇచ్చే ధాన్యం పుణ్యాన మా ఊళ్ళో ముసలివారికి అన్నదానం జరుగుతున్నది. ఈసారి తమరి పంట చేతికి అందలేదని తెలిసింది. ఈ కార్యక్రమం మరి ఎలా జరపాలో తెలీకుండా ఉంది” అని బాధ వ్యక్తం చేసారు. సోమయ్య తన అశక్తతని చెబుతూ “ఈసారికి కుదరదు. అన్నీ అనుకూలిస్తే, వచ్చే ఏడాది ఏమైనా సాయం చేస్తాను” అని చెప్పేసాడు వాళ్లకు.*

*వాళ్ళు నిరాశగా బయటికి వచ్చి, సాయాన్ని అపేక్షిస్తూ రామయ్య ఇంటికి పోయారు. రామయ్యకు కూడా పంట చేతికి అందలేదన్న బాధ ఉండింది కానీ, ముందు అనుకున్న ప్రకారం అతను ఇంట్లో పూజా కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు; దానికి ఊళ్ళో వాళ్లను అందరినీ భోజనానికి పిలిచి ఉన్నాడు.*

*ఆ సమయంలో‌ వీళ్ళు వచ్చి సాయం అడిగితే “అన్ని ఖర్చుల్లో ఇదీ ఒక ఖర్చు.. కానివ్వండి.*

*ఎలాగో ఒకలాగా మీకు అయిదారు నెలలకు సరిపడా ధాన్యం ఇస్తాను; రబీ పంటలోంచి మిగతాది చూద్దాం. ముందైతే మీరంతా భోజనం చేసి వెళ్ళండి!” అన్నాడతను.*

*ఇంట్లో వాళ్ళు ఆ సరికే సైగలు చేస్తున్నారు- “ఇంకా వంట పూర్తవలేదు” అని. “దానిదేముంది, ఏముంటే అది పెట్టండి” అంటూ దేవుడికోసం ప్రత్యేకంగా చేసిన వంటకాలను తెప్పించి వాళ్లకు పెట్టి, తృప్తిగా సాగనంపాడు రామయ్య.*

*ఆ తర్వాత గ్రామదేవతలే మారువేషంలో వచ్చి “రామయ్యా! దేవుడికి చేసిన వంటలు తెచ్చి ఎవరికో పెట్టేసావే, దేవుడంటే అంత తిరస్కారం అయితే ఎలాగ?” అన్నారు.*

*”అయ్యో, తిరస్కారం ఏమీ లేదు. వాళ్ళని చూస్తే పాపం ఆకలిమీద ఉన్నారని తెలుస్తూనే ఉంది. దేవుడిని ఆకలితో పంపితే ఎలాగ అని, ఆయనకోసం చేసినవి ఆయనకే ఇచ్చాను” అన్నాడు రామయ్య.*

*లేమిలో కూడా దానశీలతను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న రామయ్యని మెచ్చుకున్న గ్రామదేవతలు నవ్వి, “నువ్వు ఎలాంటివాడివో తెలుసు-కుందామని, ఇట్లా ఓ పరీక్ష పెట్టాము. నీ ధాన్యమూ, సోమయ్య ధాన్యమూ ఎక్కడికీ పోలేదు. మీ గాదెల్లోకే చేరి భద్రంగా ఉంది. సోమయ్యకు కూడా చెప్పు- మీరు ఇద్దరూ మీరు చేసే మంచిపనుల్ని కొనసాగించండి. మంచి పనులు చేసేటప్పుడు కూడా “నేను” అన్న అహంకారపు భావన రాకుండా చూసుకోండి. మీకు మేలవుతుంది” అంటూ మాయం అయిపోయారు.