కాంగ్రెస్‌లో కలహాలు..డిప్యూటీ సీఎంతో మరో మంత్రి మాటల యుద్ధం..!

సతీశ్‌ జార్కిహొళి, డీకేశి

డిప్యూటీ సీఎం డీకే వర్సెస్‌ మంత్రి సతీశ్‌..

కన్నడ కాంగ్రెస్‌లో కలహాలు ఉధృతమయ్యేలా ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్‌ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి లేదు…ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ మాట్లాడుతూ కేపీసీసీ అధ్యక్ష పోస్టు అంగడిలో దొరకదు, మీడియా ముందు మాట్లాడితే లభించదు అని ప్రత్యర్థులను హేళన చేశారు. గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ.. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని, కొంతమంది మీడియా ముందుకొచ్చి పదవిని కోరుతున్నారని అన్నారు. పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తానొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారన్నారు. జై భీమ్‌ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్‌చార్జి సుర్జేవాలా శుక్రవారం బెళగావికి వస్తారని, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు సూచించారు. మరోవైపు మంత్రి సతీశ్‌ జార్కిహొళికి కేపీసీసీ నుంచి నోటీసులు వెళ్లాయి.

రేసులో ఉన్నాననలేదు: సతీశ్‌

కేపీసీసీ నుంచి నోటీస్‌ ఇచ్చినప్పటికీ ఏమీ కాదు, దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుని ముందు ఇస్తానని మంత్రి సతీశ్‌ జార్కిహొళి చెప్పారు. డీకేశిపై తరచూ విమర్శలు చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, నోటీస్‌ ఇచ్చే అధికారం ఆయనకు ఉందన్నారు. కేపీసీసీ రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదన్నారు. తన మాటలతో ఎవరికీ ఇబ్బంది లేదని, నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మీడియావారు ఉదయం హీరో ను చేసి, సాయంత్రం విలన్‌ ను చేస్తారని, ఇది సబబు కాదని వాపోయారు.