🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 15 – 03 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
బహుళ పక్షం,
తిథి : *పాడ్యమి* మ12.59 వరకు,
నక్షత్రం : *ఉత్తర* ఉ7.44 వరకు,
యోగం : *గండం* మ1.01 వరకు,
కరణం : *కౌలువ* మ12.59 వరకు,
తదుపరి *తైతుల* రా1.55 వరకు,
వర్జ్యం : *సా4.57 – 6.43*
దుర్ముహూర్తము : *ఉ6.13 – 7.48,*
అమృతకాలం : *తె3.30 – 5.16,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.13,
సూర్యాస్తమయం: 6.06,
*_నేటి మాట_*
*కర్మ – దాని స్వభావం ఏమిటి??…*
సాధారణంగా ఈ ప్రశ్నకు ‘మంచీ, చెడు’ కర్మలంటే ఏమిటో నిర్వచిస్తూ జవాబు చెప్పటం పరిపాటి…
కానీ కర్మ అనేది అంతకంటే చాలా లోతయిన విషయం…
కర్మలలో చాలా రకాలు ఉంటాయా.. ఉంటే, మానవుని మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది…
‘నా జీవితం’ అని మీరు చెప్పుకొనేది ఏమిటో తెలుసా.. కొంత మొత్తం జీవశక్తి, దాంతో పాటు దాన్ని నియంత్రించేందుకు కావలసిన కొంత సమాచారం.
ఈ సమాచారాన్ని, ఈ కాలపు పరిభాషలో చెప్పాలంటే ‘సాఫ్ట్ వేర్’ అనవచ్చు, కొంత మొత్తం జీవ శక్తితో, కొంత సమాచారం అనుసంధానమై, జోడించబడి ఉంటుంది.
ఈ రెండూ కలిస్తే ఏర్పడే సాంకేతిక పరిజ్ఞానం వల్ల నడిచే వ్యవస్థే ‘మీరు’……….
మీలో అమర్చి ఉన్న సమాచారం ఎలాంటిదో, దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం రూపు దిద్దుకొంటుంది.
మీ పాత సంస్కారాలు మీరు పుట్టిన సమయానికి ఎంతో కాలం ముందునుంచే ఏర్పడి వస్తూ ఉంటాయి.
కానీ ప్రస్తుతం ఉన్న మీ అవగాహన బట్టి, మీ తల్లిదండ్రులెలాంటి వారూ, కుటుంబం ఎలాంటిదీ, ఎలాంటి విద్యా బుద్ధులు అలవడ్డాయి, ఎలాంటి మత పరమైన, సాంఘిక పరమైన నేపథ్యం మీకు లభించిందీ, ఎలాంటి సాంస్కృతిక సంప్రదాయాలలో పెరిగారూ.. ఇలాంటి విశేషాలు మాత్రమే మీ వ్యక్తిత్వాన్ని రూపు దిద్దే సమాచారం అని మీరు భావించచ్చు.
ఒక వ్యక్తిలో అమరిక చేయబడ్డ మొత్తం సమాచారం ఎలాంటిదో, దాన్ని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం, స్వభావం, విశిష్టతలూ ఏర్పడతాయి.
ఆ సమాచారం అంతటినీ కలిపితే, అదే ‘కర్మ’ అవుతుంది. దీన్ని సంప్రదాయికంగా ‘కర్మ’, లేక ‘కర్మ శరీరం’ లేక ‘కారణ శరీరం’ అంటారు. జన్మ ఏర్పడటానికి కారణం ఇదే.
*కర్మలలో రకాలు…*
కర్మ అనే ఈ సమాచారం రక రకాల స్థాయిలలో ఉంటుంది. ఇందులో ఉన్నా వాటిలో కొన్ని మనం ఇప్పుడు చర్చిస్తున్న విషయానికి సంబంధించినవి కావు. మనకు విషయం అర్థమయ్యేందుకు రెండు రకాలూ చాలు. అవి..
1) సంచిత కర్మ
2) ప్రారబ్ధ కర్మ
మొదటిది ‘సంచిత కర్మ’. ఇది మన పూర్వ కర్మలన్నీ రాశి పోసి పడేసిన గిడ్డంగి.
జీవ పరిణామానికి తొట్ట తొలి దశ అయిన ఏక కణ జీవి దశ నుంచి, ఆ మాటకొస్తే, అంతకంటే ఇంకా ముందున్న అప్రాణి దశ నుంచి, పోగుపడుతూ వస్తున్న కర్మల రాశి ‘సంచిత కర్మ’. అప్పటి నించి వచ్చిన సమాచారమంతా ఇందులో భాగం.
మీరు కళ్ళు మూసుకొని మీలోకి మీరు ధ్యాసగా చూసుకొంటే చాలు, ఈ బ్రహ్మాండ తత్త్వం అంతా తెలుసుకోగలరు.
అలా తెలుసుకోటానికి మీ మేధాశక్తినంతా ఉపయోగించనక్కర్లేదు.
బ్రహ్మాండ తత్త్వానికి సంబంధించిన సమాచారం అంతా, మీ శరీర నిర్మాణంలో ఇమిడే ఉంది కనక సృష్ట్యాది నుంచి సమస్త సమాచారాన్నీ నింపుకొంటూ వస్తున్న గిడ్డంగి మీది. అదే మీ ‘సంచిత కర్మ’.
కానీ, మీరు నేరుగా గిడ్డంగిలో ఉన్న సరుకుతో చిల్లర వ్యాపారం చేయలేరు. చిల్లర వ్యాపారం చేసుకొనేందుకు చిల్లర దుకాణం ఏర్పాటు చేసుకోవాలి.
ఈ జన్మకు మాత్రమే సరిపడే (సరుకు ఉన్న) దుకాణాన్ని ‘ప్రారబ్ధం’ అంటారు. ‘ప్రారబ్ధ కర్మ’ అంటే, ఈ జన్మ కోసం మాత్రమే కేటాయించిన సమాచారపు మోతాదు మొత్తం.
మీ జీవితం ఎంత చురుకు గా, ఎంత క్రియాశీలతతో సాగుతున్నదో, దాన్ని బట్టి, తనకు ఈ జన్మకు కావలసినంత సమాచారాన్ని తనే కేటాయించు కొంటుంది.
సృష్టి కరుణామయమైన దృక్పథంతో సాగుతుంది. మీరు ఇంతవరకు పోగు చేసుకొన్న కర్మల రాశి మొత్తాన్నీ ఒకే విడతలో మీకిస్తే, అది మోయలేక మీరు క్రుంగి, కృశించి, నశిస్తారు.
ఇప్పుడే, జనంలో చాలా మందికి ఒకే ఒక్క జన్మలో, 30-40 సంవత్సరాల కాలంలో, పోగయిన జ్ఞాపకాల బరువే మోయరానిదై కుంగదీస్తుంది.
ఇక అంతకొక నూరు రెట్లు ఎక్కువ జ్ఞాపకాల బరువు వాళ్ళ నెత్తి మీద వేస్తే, వాళ్ళు అసలే బతకలేరు. అందుకే ప్రకృతి వాళ్ళు ఒక్క జన్మకు మోయగలంత పూర్వ జ్ఞాపకాల బరువును మాత్రమే వాళ్ళకు ప్రారబ్ధ కర్మగా కేటాయిస్తుంది.
*కర్మ : సాధకుడి జీవితంలో దాని పాత్ర…*
మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారంటే, మీరొక ప్రతిజ్ఞ చేస్తున్నట్టు. ‘నేను నా చరమ గమ్యాన్ని అతి త్వరగా అందుకోవాలనే వేగిరపాటులో ఉన్నాను’ అని.
దానికోసం నూరు జన్మలు గడపటం మీకు ఇష్టం లేదు. పైగా అలా నూరు జన్మలు గడిపితే, ఆ నూరు జన్మలలో మరింత కర్మ ఫలం పోగై, దాన్ని వదిలించుకోవటానికే, మరో వెయ్యి జన్మలు ఎత్తవలసి వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే మీ ప్రస్థానం వేగం పెంచాలని మీ కోరిక కనక ఆధ్యాత్మిక ప్రక్రియలను ఆరంభించి, నిర్దిష్టమైన పద్ధతిలో దీక్షా స్వీకారం చేస్తే, జీవితంలో ఆధ్యాత్మిక సాధన లేకుండా లభించని కొత్త పార్శ్వాలూ మీ ముందు ఆవిష్కృతమౌతాయి. మీకు ఆధ్యాత్మిక ఆసక్తి ఏమీ లేకపోతే, మీ జీవితం కొంత ప్రశాంతంగా గడుస్తుంది. నిజమే, కానీ అది నిర్జీవమైన జీవితం అవుతుంది. అది జీవ స్థితి కంటే, మృత్యుస్థితికి దగ్గరగా ఉంటుంది..
మీలో ఉన్న జీవాన్ని కదిలించి, ఊపివేసే కుదుపులేవీ లేకుండా, మీరు అనాయాసంగా కాల వ్యయం చేసి వెళ్ళి పోతారన్న మాట.
చాలా మందికి మరొక దురభిప్రాయం కూడా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారంటే, ఇక మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంకా జీవితం నిరాటంకంగా సాగిపోతుందీ అని.
మీరు కొన్ని మనసుకు హాయిగా ఉండే నమ్మకాలూ, విలువలూ అలవరచుకొని, ఒక దిశలో మాత్రమే ఆలోచించటం మొదలెడితే, అంతా నిర్మలంగానూ విస్పష్టంగానూ కనిపిస్తుంది.
కానీ మీరు నిజంగా ఆధ్యాత్మిక మార్గం పట్టుకొన్నారంటే మాత్రం ఏదీ అంత స్పష్టంగా కనిపించదు. అంతా అలికివేసినట్టు, అస్పష్టంగా అనిపిస్తుంది. మీరు ఎంత వేగంగా పురోగమిస్తే అస్పష్టత అంత ఎక్కువవుతుంది.
*ఉదాహరణ…*
మనము ఓక వూరు నుండి వేరే వూరు వెల్తున్నాము. ఆ గమ్య స్థలం దాదాపు 450 కిలోమీటర్లు. సాధారణంగా ఆ ప్రయాణానికి అయిదు గంటలు పడుతుంది. రోడ్డు మీద అయిదు గంటలు కారు నడుపుతూ వెళ్ళే ఉద్దేశ్యం లేదు. అందుకే వేగం పెంచేశాను. దాదాపు గంటకు 200 కిలో మీటర్ల వేగంతో వెళ్ళాం.
మా మార్గంలో వచ్చే గ్రామ సీమలు ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందినవి. నేనూ ఆ ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ వెళ్ల వచ్చనుకున్నాను.
కానీ వేగంగా కదులుతున్న దృశ్యాలను కళ్ళు తిప్పి చూద్దామని ఎంత ప్రయత్నించినా, ఆ గ్రామ సీమలన్నీ అతి వేగంగా అస్పష్టంగా దృశ్యాదృశ్యంగా కదిలి పోయాయి.
ఏమీ కనిపించలేదు, అసలు నా ముందున్న రోడ్డు మీద నుంచి ఒక్క క్షణం కూడా దృష్టి మళ్లించ లేకపోయాను. మంచు కూడా కురుస్తుంది. విపరీతమైన వేగంతో ప్రయాణం చేశాం.
కనక, మీరు ప్రయాణ వేగం పెంచిన కొద్దీ చుట్టూ ఉన్నవన్నీ అలికినట్టూ అస్పష్టంగా అయిపోతాయి. మీరు చేస్తున్న పని మీది నుంచి కొన్ని క్షణాలు కూడా దృష్టి మళ్లించటం కుదరదు..
గ్రామ సీమలన్నీ కన్నుల పండుగగా చూసుకొంటూ వెళ్లాలంటే, మీరు నిదానంగా నిశ్చింతగా వెళ్ళాలి.
మీరు గమ్య స్థానం తొందరగా చేరాలనుకొంటే మాత్రం వేగం వీలైనంత ఎక్కువ పెంచాలి, అప్పుడిక మీరు ఏదీ చూడలేరు, ముందుకు పోతూ ఉంటారంతే.
ఆధ్యాత్మిక మార్గం అలాంటిది… మీరు నిజంగా ఆ మార్గం పట్టారంటే, మీ చుట్టూ అంతా కోలాహలమే, గందరగోళమే. కానీ ప్రయాణమంటూ సాగుతున్నది కనక ఫర్వాలేదు.
ఈ వేగం మీకు సౌకర్యంగా లేదనుకుంటే జీవ పరిణామ వేగం ఉండనే ఉంది.
ఆ నత్త నడక వేగంతో ఓ పది లక్షల సంవత్సరాలు పడితే పడుతుంది గమ్యం చేరటానికి, ప్రతి సాధకుడూ ముందే నిర్ణయించుకోవాలి, తను నిదానంగా కులాసాగా, దోవంతా చూసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాడా, లేక అతి త్వరగా గమ్యస్థానం చేరాలని ఆతురతలో ఉన్నాడా అని…
*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏