– ట్రంప్ ప్రభుత్వాన్ని కోరిన అమెరికా పారిశ్రామిక సంఘాలు, కంపెనీలు
– మోడీ సర్కార్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి
అమెరికా వస్తువులపై సుంకాలు, సుంకేతర పన్నులు, నిబంధనలకు సంబంధించిన ఇతర అవరోధాలను తగ్గించేలా భారత్‌పై ఒత్తిడి తేవాలని అమెరికాలోని పలు ప్రముఖ పారిశ్రామిక సంఘాలు, కంపెనీలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరాయి. ఏప్రిల్ 2వ తేదీ నుండి వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలు విధించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అమెరికా వాణిజ్య మండలి (యూఎస్‌సీసీ), కొయలిషన్ ఆఫ్ సర్వీసెస్ ఇండిస్టీస్ (సీఎస్ఐ), మోటార్‌బైక్ కంపెనీ హార్లే డేవిడ్సన్ సహా పలు సంస్థలు, కంపెనీలు ఈ విజ్ఞాపన చేశాయి. అమెరికా వాణిజ్య మండలి ఆ దేశంలో అత్యంత ప్రభావవంతమైన లాబీయింగ్ గ్రూప్. ‘మేక్ ఇన్ ఇండియా’ నిబంధనలను సవరించి, ప్రభుత్వ సేకరణ ప్రక్రియలో అమెరికా సరఫరాదారులను చేర్చాలని ఈ గ్రూప్ భారత్‌ను కోరుతోంది.
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య చర్చలు ప్రారంభమైనప్పటి నుండి వాణిజ్య సంబంధాలను విజయవంతమైన ఒప్పందం దిశగా తీసుకుపోవాలని ఇరు దేశాలను యూఎస్‌సీసీ కోరుతోంది. ముఖ్యంగా ఔషధాలపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించాలని అడుగుతోంది. దీనివల్ల అమెరికాలో ఉంటున్న భారతీయ వినియోగదారులకు అందుబాటు ధరలో మందులు దొరకడంతో పాటు ఆరోగ్య రంగంలో వాణిజ్యం, పెట్టుబడులు పెరుగుతాయని అంటోంది. పేటెంట్ హక్కులు కలిగిన మందులు, వైద్య పరికరాల ధరలపై నియంత్రణ విధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ పునరుద్ధరించిన వైద్య పరికరాల దిగుమతులను అనుమతించాలని భారత్‌ను కోరింది.
గ్యాస్‌తో కూడిన ఆల్కహాల్ లేని పానీయాలపై భారత్ 28 శాతం జీఎస్టీ విధిస్తోందని, ఇది అమెరికా కంపెనీలకు నష్టదాయకంగా ఉన్నదని, దీనిని తగ్గించాలని యూఎస్‌సీసీ సూచించింది. గ్యాస్‌తో కూడిన ఆల్కహాల్ లేని పానీయాలకు సంబంధించి పన్ను వర్గీకరణలను సమీక్షించాలని అంటూ దీనివల్ల పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించవచ్చునని, ఆదాయాన్ని పెంచవచ్చునని, ప్రజారోగ్య లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపింది. కాగా అమెజాన్, గూగుల్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎస్ఐ కూడా ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధిస్తోంది. భారత డిజిటల్ విధానాలను అది వ్యతిరేకించింది. యూపీఐ, రూపే కార్డ్ వంటి దేశీయ చెల్లింపుల వ్యవస్థను కూడా తప్పుపట్టింది.
ఇదిలావుండగా భారత్ నిబంధనలపై అమెరికా అప్పరల్ అండ్ ఫుట్‌వేర్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) కూడా విమర్శలు సంధించింది. ఈ నిబంధనల కారణంగా మార్కెట్ నుండి అమెరికా కంపెనీలు తరలిపోవాల్సి వస్తోందని విమర్శించింది. డెయిరీ, గోధుమలు, సోయాబీన్, బాదంపప్పులపై సుంకాలు తగ్గించాలని అమెరికా వ్యవసాయ లాబీయింగ్ గ్రూపులు కూడా కోరుతున్నాయి. కాగా సుంకాలు తగ్గించాలన్న ట్రంప్ ప్రభుత్వ డిమాండ్‌ను హార్లే-డేవిడ్సన్ సమర్ధించింది. అమెరికా, యూరప్, బ్రెజిల్, థారులాండ్‌లో సుంకాలు తక్కువగా ఉన్నాయని, కానీ అమెరికా మోటారు సైకిళ్లపై భారత్ 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోందని ఆక్షేపించింది. అయితే దిగుమతి చేసుకుంటున్న మోటారు సైకిళ్లపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దిగుమతి సుంకాన్ని తగ్గించింది. 1,600 సీసీ వరకూ ఇంజిన్ సామర్ధ్యం ఉన్న బైక్స్‌పై సుంకాన్ని 50 శాతం నుండి 40 శాతానికి, 1,600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్ధ్యం ఉన్న బైక్స్‌పై సుంకాన్ని 50 శాతం నుండి 30 శాతానికి తగ్గించింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...