కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారంపై రగడ..

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఎందుకివ్వట్లేదని, ఎప్పుడిస్తారని బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రిని నిలదీశారు. దీంతో మంత్రి తీవ్ర అసహనానికి లోను కాగా, పోలీసులు సంయమనం కోల్పోయి బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీఛార్జి చేసేదాకా వెళ్లింది.. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి లాఠీఛార్జ్ లో దెబ్బలు తిన్న కార్యకర్తలతో పాటు నియోజకవర్గం నుండి పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి భీమ్‍గల్ పెట్‌రోల్ బంక్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని చేతకాని ప్రభుత్వాన్ని, పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, తన కార్యకర్తలతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగడంతో సమస్య గంభీరంగా మారింది.

ఏమనుకుంటే ఏమైందంటూ కాంగ్రెస్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. పెద్ద ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేసి ఎక్కువ సంఖ్యలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఒకేసారి లబ్దిదారులకు పంపిణీ చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ, తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లు కాంగ్రెస్ పార్టీకి మైలేజీ మాట దేవుడెరుగు ఇస్తానన్న తులం బంగారం ఇవ్వండని అడిగితే లాఠీఛార్జీ చేస్తారా? ఇదెక్కడి న్యాయం అంటూ ప్రజల నుంచే విమర్శలు వ్యక్తమవడంతో కాంగ్రెస్ నాయకులు కంగుతింటున్నారు.

వ్యూహాత్మకమేనా..?

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారంపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలను వ్యూహాత్మకంగానే మంత్రి సమక్షంలో ఉసిగొల్‌పారా? బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రియాక్షన్ ఎలా ఉంటుందో బాగా తెలిసిన ప్రశాంత్ రెడ్డి పోలీసులు లాఠీఛార్జీని ముందుగానే ఊహించారా? ఇలా చేస్తేనే తులం బంగారం అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమవుతుందని ప్రశాంత్ రెడ్డి భావించారా? లాఠీఛార్జీ అంశాన్ని కేటీఆర్, హరీష్ రావు, కవిత లాంటి పెద్ద నాయకులు దీన్ని సీరియస్ అంశంగా మారుస్తారనే ఆలోచనతోనే తులం బంగారం అంశాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి సమక్షంలో గట్టిగా లేవనెత్తారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేయాల్సిన రైట్ స్థానిక ఎమ్మెల్యే కే ఉంటుందని, తనతో పంపిణీ చేయించడం ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీ కావాలనే ఆలస్యం చేస్తోందని ప్రశాంత్ రెడ్డి రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో విమర్శించారు. మీ గొప్పల కోసం పోయి లబ్దిదారుల చెక్కుల పంపిణీని ఆలస్యం చేయవద్దని, తనతో పంపిణీ చేయించడం ఇష్టం లేకపోతే గ్రామకార్యదర్శులతో ఇప్పించాలని కూడా కోరారు. దీంతో ఒకసారి రద్దయిన మంత్రి జూపల్లి పర్యటనను వెనువెంటనే ఖరారు చేసి చెక్కుల పంపిణీ చేపట్టారు. కానీ, చెక్కుల పంపిణీలో తులం బంగారం అంశం కార్యక్రమాన్ని అభాసు చేసేలా పోలీసుల లాఠీచార్జి వరకు వెళ్లడంతో కాంగ్రెస్ నాయకులు మంత్రి జూపల్లి సమక్షంలో డామిట్.. కథ ఇలా అడ్డం తిరిగిందేందబ్బా.. అంటూ తలలు పట్టుకోవాల్సి వచ్చింది.